ప్రయాగ్‌రాజ్ వేదికగా మహాకుంభమేళా ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాల కోసం కోట్ల సంఖ్యలో జనం వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 42 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొని.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, దేశవిదేశాల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తుండటంతో.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు నిత్య నరకం చవిచూస్తున్నారు. కొన్ని చోట్ల అయితే.. వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ముందుకు వెళ్లే పరిస్థితి లేదని.. దాదాపు 300 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. చాలా మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా భక్తులకు పోలీసులు సూచనలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత భారీ ఎత్తున భక్తులు కుంభమేళా కోసం తరలి వెళ్తున్నారు. చాలా మంది మార్గమధ్యంలోనే ట్రాఫిక్‌లో గంటల తరబడి, పూటల తరబడి ఇరుక్కుపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రయాగ్‌రాజ్ ఎయిర్ పోర్టు నుంచి త్రివేణి సంగమం వరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ఎకో టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు, ప్లై ఓలా భాగస్వామ్యంతో ఈ హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. విమానం ద్వారా.. ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే భక్తులు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా త్రివేణి సంగమానికి చేరుకోవడానికి వీలు లేకపోవడంతో హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. రోడ్డు మార్గంలో వెళ్తే.. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ కారణంగా ముందుకు వెళ్లేందుకు గంటలకు గంటల సమయం పడుతోంది. అందుకే ఈ హెలికాప్టర్ సేవలతో కొంతయినా రోడ్లపై రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా త్రివేణి సంగమం వరకు ఏర్పాటు చేసిన ఈ హెలికాప్టర్ సేవలు మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఎయిర్‌పోర్టులో దిగి 23.7 కిలో మీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమానికి హెలికాప్టర్‌లో డైరెక్టుగా వెళ్లాలంటే.. ఒక్కో ప్రయాణికుడు రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనే హెలికాప్టర్ ఛార్జీ, బోట్ ట్రాన్స్‌పోర్ట్, ఇతర సేవలు కూడా కలిపి ఉంటాయి. ఈ హెలికాప్టర్ సేవలు ఉపయోగించు కోవాలంటే ముందుగానే ఫ్లై ఓలా వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ సేవలు అప్ అండ్ డౌన్ ఉంటాయి. రూ.35 వేలతో టిక్కెట్ బుక్ చేసుకుంటే.. ఎయిర్ పోర్ట్ నుంచి త్రివేణి సంగమానికి తీసుకెళ్లి.. పుణ్యస్నానాలు ఆచరించి, ఇతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి ఎయిర్ పోర్ట్‌కు తీసుకెళ్తారు. ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పలు ఘాట్లు ఉన్నప్పటికీ భక్తులు ఎక్కువగా త్రివేణి సంగమంలోనే పుణ్యస్నానాలు ఆచరించేందుకు మక్కువ చూపుతున్నారు. అందుకు కారణం ఏంటంటే.. మూడు నదులు గంగా, యమునా, సరస్వతి కలిసే ప్రదేశాన్నే త్రివేణి సంగమం అంటారు. హిందూ ధర్మ ఆచారం ప్రకారం సాగర మథనం జరిగిన సమయంలో ఇదే ప్రదేశంలో అమృతం వచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.