తెలంగాణ మంత్రుల మధ్య హెలికాప్టర్ వినియోగంపై అసంతృప్తి సెగలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం కొందరు మంత్రులు మాత్రమే హెలికాప్టర్ సౌకర్యాన్ని వినియోగించుకుంటుండగా.. మిగతావారికి ఆ అవకాశం దక్కకపోవడంతో వాళ్లలో అసహనం వ్యక్తమవుతున్నట్లు పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది.
సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల కోసం ప్రభుత్వ హెలికాప్టర్‌ను వినియోగిస్తారు. సీఎం పర్యటనలు లేనప్పుడు, హెలికాప్టర్ ఖాళీగా ఉన్న సందర్భాల్లో ఇతర మంత్రులు దాన్ని ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ నిబంధనలు క్లియర్ కాకపోవడం, కొందరికి హెలికాప్టర్ అందుబాటులోకి రావడం, మరికొందరికి మాత్రం అందకుండా ఉండటంతో అసమానతలు నెలకొన్నాయి.
కొందరు మంత్రులకు ఎక్కువ ప్రాధాన్యం?
ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు తరుచుగా హెలికాప్టర్ వినియోగిస్తున్నారు. దూర జిల్లాలకే కాదు, దగ్గరలోని ప్రాంతాలకు కూడా హెలికాప్టర్‌లోనే వెళ్లడం సచివాలయం వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ప్రత్యేకంగా నలుగురైదుగురు మంత్రులు రెగ్యులర్‌గా హెలికాప్టర్‌ను వాడుతున్నారని సమాచారం. అయితే, మిగతా మంత్రులు ఈ అవకాశం కోల్పోతుండటంతో వారిలో అసంతృప్తి పెరుగుతోంది.
ఒక మంత్రి రంగారెడ్డి జిల్లాలో పర్యటన కోసం కూడా హెలికాప్టర్ వాడినట్లు సమాచారం. మరికొందరు మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా, హెలికాప్టర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రమే హెలికాప్టర్‌ను ఎక్కువగా వాడుతున్నారని ఓ సీనియర్ మంత్రి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రైవేట్ కార్యక్రమాలకూ హెలికాప్టర్?
ఇంతటితో ఆగకుండా, కొంతమంది మంత్రులు హెలికాప్టర్‌ను ప్రైవేట్ ఫంక్షన్లు, విందులకు కూడా వినియోగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి వాటితో ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దామోదర వ్యాఖ్యలు.. మళ్లీ దుమారం
ఇటీవల సీనియర్ మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత మంటపెట్టాయి. నల్గొండ మంత్రులకే గాలిమోటర్ భాగ్యం లభిస్తోందంటూ దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలు, కేబినెట్‌లో హెలికాప్టర్ వినియోగంపై కలకలం సృష్టించాయి.
పల్లె వెలుగు బస్సులా..? విపక్షాల విమర్శలు :
ఇక, సహజంగానే విపక్షాలు ఈ హెలికాప్టర్ వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొంతమంది మంత్రులు హెలికాప్టర్‌ను పల్లె వెలుగు బస్సులా మార్చేశారంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రజల పన్నులపై నడుస్తున్న ప్రభుత్వం, కొందరు మంత్రుల ఫెవరిటిజం కోసం ఖర్చు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వివాదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా ఫుల్‌స్టాప్ పెడతారు? అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రుల మధ్య విభేదాలు తొలగిపోయేలా ఎలా చేస్తారన్న దానిపై రేవంత్ తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.