గవర్నర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారా పోసినట్లుందన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈ యేడాది గవర్నర్ ప్రసంగానికి అస్సలు తేడా లేదన్నారు. గవర్నర్లు మాత్రమే మారారని, ప్రసంగాలు మారలేదన్నారు. చేయనివి చేసినట్లు, ఇవ్వనివి ఇచ్చినట్లు.. అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తో చెప్పించిందని ఆయన విమర్శించారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. బీసీల కులగణన అంతా తప్పుల తడకగా చేసి.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన బిల్లు ప్రవేశ పెడతారని ప్రశ్నించారు. తప్పులతో కూడిన కులగణన చేసిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా ఎలా నిర్వహిస్తారని హరీష్ రావు అన్నారు. కనీసం అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని వాళ్లు.. సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతారా? అని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారని.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని.. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా వీటిని భావించాలా? అని హరీష్ రావు ప్రశ్నించారు.
లక్షా 78వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని గొప్పలు చెబుతున్నారని, ఇప్పటి వరకు చెప్పిన ఒప్పందాలు ఎన్ని గ్రౌండ్ అయ్యాయన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎంఇలు ఇబ్బందులు పడుతుంటే, కొత్త పాలసీ అని డబ్బా కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్నాలకే పరిమితం చేసారన్నారు. ఇంకా రూ.400 కోట్లు పెండింగ్ ఉందని, రూ.1200 కోట్లు ఇచ్చామనేది పచ్చి అబద్దమన్నారు. 445 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. కనీసం రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు.
కృష్ణా జలాలు ఆంధ్రా వాళ్లు దోచుకుపోతుంటే మౌనంగా ఉన్న మీరు దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామి నెలకు 2500 ఇప్పటికి దిక్కులేదని.. ఇంకా దీన్ని గేమ్ చేంజర్ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళా సంఘాలకు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని అబద్దం చెప్పారని,. పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. జా బ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని.. నిరుద్యోగ భృతి ఊసే లేదని, ఏటా 2లక్షల ఉద్యోగాలు అని యువతను మోసం చేశారని విమర్శించారు.