ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
క్లియర్ టెల్లిజెన్స్ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభోత్సవం
ఉగాది తర్వాత మహేశ్వరంలో ఏఐ సిటీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో శుక్రవారం “క్లియర్ టెల్లిజెన్స్” ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక్కడే 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామన్నారు. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో తెలంగాణ హబ్‌గా మారుతుందన్నారు. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలను ప్రారంభించామని, త్వరలోనే
“క్వాంటం కంప్యూటింగ్”లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. టెక్నాలజీ అంటేనే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. పారిశ్రామిక వేత్తలు ఎదిగితే… రాష్ట్రం కూడా వృద్ధి చెందుతుందన్నారు. ప్రతిభ గల యువతే తెలంగాణకున్న అతి పెద్ద ఆస్తి అన్నారు. రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారాలను కనుక్కునేందుకు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.
ఏఐ, డేటా ఇంజనీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో సేవలు అందించే “క్లియర్ టెల్లిజెన్స్” సంస్థ తమ ఇండియా శాఖను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో “క్లియర్ టెల్లిజెన్స్” సీఈవో ఓవెన్ ఫ్రివోడ్, మేనేజింగ్ పార్ట్ నర్ అనిల్ భరాడ్వా, డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.