రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ – TGIIC ఇచ్చిన నివేదిక ప్రకారం దీనిని నిర్ధారించారు. ఇక, ఈ 400 ఎకరాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములు ఏవీ లేవని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల కిత్రం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. వేలం, తద్వారా జరిగే అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవని స్పష్టం చేసింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదని కూడా స్పష్టంగా ప్రకటించింది.
ప్రధానాంశాలు:
-
2004, జనవరి 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు క్రీడా వసతుల అభివృద్ధికి కేటాయించింది.
-
ప్రాజెక్టు ప్రారంభం కానందున 2006, నవంబర్ 21న భూమి కేటాయింపును రద్దు చేసి, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు అప్పగించింది.
-
భూమి రద్దును సవాల్ చేస్తూ 2006లో ఐఎంజీ హైకోర్టులో రిట్ పిటిషన్ (24781/2006) దాఖలు చేసింది. దీని పై 2024, మార్చి 7న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
-
సుప్రీంకోర్టులో ఐఎంజీ అప్పీల్ చేసినా, 2024, మే 3న సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
-
రెవెన్యూ రికార్డుల ప్రకారం, ఈ భూమి కంచ అస్తబల్ పోరంబోకు సర్కారీ భూమిగా గుర్తింపు పొందింది.
-
2022, సెప్టెంబర్ 14న GO MS 571 ప్రకారం భూమి హక్కుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
-
2024, జూన్ 24న టీజీఐఐసీకి ఈ భూమి హక్కులు బదలాయించబడ్డాయి. 2024, జూలై 1న రెవెన్యూ అధికారులు భూమిని అధికారికంగా అప్పగించారు.
పర్యావరణ పరిరక్షణ:
400 ఎకరాల అభివృద్ధి ప్రణాళికలో మష్రూమ్ రాక్స్, రాక్ ఫార్మేషన్లను పర్యావరణ హితంగా కాపాడుతామని టీజీఐఐసీ తెలిపింది.
బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లను అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేర్చలేదు.
2025, ఫిబ్రవరి 28న టీజీఐఐసీ RFP విడుదల చేసింది, భూమిని పర్యావరణ అనుకూలంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో సహకారం:
హద్దుల గుర్తింపులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారుల సహకారం తీసుకున్నట్లు టీజీఐఐసీ వివరించింది.
2024, జూలై 19న హద్దులను అధికారికంగా నిర్ధారించారు.
ప్రభుత్వ భూమి హక్కుల రక్షణ:
ఈ భూమిపై ప్రభుత్వ హక్కులను న్యాయస్థానాలు కూడా సమర్థించాయి. అభివృద్ధి ప్రణాళికలు పర్యావరణ అనుకూలంగా ఉంటాయని ప్రభుత్వంతో పాటు టీజీఐఐసీ హామీ ఇచ్చింది.