ఇప్పుడు మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సప్ కచ్చితంగా ఉంటోంది. విద్యార్థుల నుంచి మొదలుకొని ఉద్యోగులు, వ్యాపారులు, మహిళల దాకా చాటింగ్, సమాచారం షేర్ చేసుకునేందుకు వాట్సప్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కుటుంబం, మిత్రులు, సహచరులు అందరూ కనెక్ట్ అయ్యే వేదికగా మారిన ఈ యాప్‌లో ఇప్పుడు కొత్త రకం మోసాల బూచి బయలుదేరింది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త టెక్నిక్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌లో తాజాగా బయటపడ్డ మోసం అందరినీ భయపెడుతోంది. అయితే, దీని గురించి అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాట్పప్‌లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఒక ఫోటో వస్తోంది. ఇది సాధారణ ఇమేజ్‌లా కనిపించినా, బైనరీ కోడ్‌తో తయారుచేస్తున్నారు. ఈ ఇమేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే మాల్వేర్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంది. ఆ మాల్‌వేర్ ఇన్‌స్టాల్ కాగానే.. వాట్సప్ యూజర్ అకౌంట్, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ వంటి డేటా నేరుగా సైబర్ క్రిమినల్స్‌కు చేరిపోతుంది. కాబట్టి గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఇమేజ్ మెసేజ్‌లను ఓపెన్ చేయవద్దని, వెంటనే డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఏపీకే ఫైల్‌ల రూపంలో వచ్చే మెసేజ్‌లు కూడా అకౌంట్లను ఖాళీ చేసే ప్రమాదం ఉంటుందని, మొబైల్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయ్యే అవకాశమూ ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు. దీంతో, ఓటీపీ వంటి సెన్సిటివ్ సమాచారం కూడా హ్యాక్ చేయబడే ప్రమాదం ఉందంటున్నారు.
వాట్సప్ యూజర్ల సేఫ్టీ సెక్యూరిటీ కోసం పలు ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినా, అవగాహన లేకుండా ఉన్నవారు మాత్రం మోసపోతూనే ఉన్నారు. గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చిన లింకులు, వీడియోలు, ఫోటోలను తక్షణమే ఓపెన్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు తెలిసిన గ్రూపుల్లోనూ ఇలాంటి మెసేజ్‌లు ఉండే అవకాశం ఉంది. అలాంటి వాటిని అవగాహన లేకుండా ఓపెన్ చేస్తే ప్రమాదం తప్పదంటున్నారు.
ఈ నేపథ్యంలో వాట్సప్‌ను సురక్షితంగా ఉపయోగించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. అపరిచిత నెంబర్ల నుంచి వచ్చిన మెసేజ్‌లకు రెస్పాండ్ కావొద్దని చెబుతున్నారు. గ్రూపుల్లో వచ్చే సస్పెక్టెడ్ కంటెంట్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే, మన మొబైల్‌లోని ఇన్ఫర్మేషన్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.