28.6 C
Hyderabad
Saturday, July 25, 2026

Live Video

spot_img

ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్‌ – భారం మోయలేకపోతున్న పేరెంట్స్‌

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేయాలన్న డిమాండ్ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఎప్ సెట్‌ ర్యాంకులు, ఇంటర్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి, కాలేజీలు ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి. ముందస్తుగా సీటు రిజర్వు పేరుతో మొత్తం ఫీజులో 30 నుంచి 50 శాతం డబ్బు తీసుకుంటూ, తరువాత నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత మిగతా మొత్తం వసూలు చేసే ఒప్పందాలు చేసుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రభుత్వం బీ–కేటగిరి సీట్లు భర్తీ చేస్తే, పేరెంట్స్‌ ముందుగా చెల్లించిన డబ్బులు తిరిగి రావడం కష్టమేనన్న భయం ఉంది. ఈ కారణంగా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా నిబంధనల్ని విస్మరించి ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సీట్లు కేటాయిస్తున్న ప్రైవేట్‌ కాలేజీల వ్యవహారాన్ని ఆపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వ అనుమతిలేక అడుగులు వెనక్కి వేస్తున్నారని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉన్న 157 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో దాదాపు లక్ష సీట్లు ఉండగా, వాటిలో 70 శాతం సీట్లు ఎప్‌సెట్‌ ర్యాంకుల ద్వారా నింపుతారు. మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటాకింద, అందులో కొంత ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేస్తారు. ఎప్‌సెట్‌ ద్వారా భర్తీ చేసే సీట్లకు నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌ జరుగుతుంటే, మేనేజ్‌మెంట్ కోటాలో మాత్రం కాలేజీలకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు వ్యవహారం సాగుతోంది.

బీ కేటగిరి సీట్లను కూడా ఎప్‌సెట్‌, జేఈఈ ర్యాంకులు, ఇంటర్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలన్న నిబంధనలు ఉన్నా, వాటిని పాటిస్తున్న కాలేజీలు చాలా తక్కువ. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ వంటి బ్రాంచ్‌లకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పేరెంట్స్‌ కొన్నేళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని ప్రభుత్వమే నిర్వహించాలని స్టూడెంట్ యూనియన్లు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది హయ్యర్‌ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌ ఈ విషయంలో ముందడుగు వేసి, బీ కేటగిరి సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమన్న లేఖను ప్రభుత్వానికి ఇచ్చినా, ప్రభుత్వం స్పందించలేదని చెబుతున్నారు.

ఈ ఏడాది బీటెక్ ఫీజుల్లో మార్పులు కూడా రానున్న నేపథ్యంలో, ఇప్పటికైనా అడ్మిషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో నింపితే, అక్రమ దందాలకు చెక్ పడుతుందన్న నమ్మకంతో పేరెంట్స్‌ ఎదురు చూస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com