హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై వెళ్లే వారికి శుభవార్త. కృష్ణా నదిపై కొత్త వంతెన అందుబాటులోకి రానుంది. తెలంగాణ నుంచి చెన్నై, తిరుపతి వెళ్లే వారికి కొత్త వారధితో 90 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. గంటన్నర ప్రయాణం కలిసి రానుంది. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా…తాజాగా టెండర్లు పిలిచేందుకు కేంద్రం సిద్దమైంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అధికార వర్గాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మూడేళ్ల క్రితమే ఈ బ్రిడ్జీ నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. 800 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,062 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇటీవల నేషనల్ హైవేస్ ఒరిజినల్ (ఎన్‌హెచ్-ఓ) జాబితాలో చేర్చడంతో ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తవుతాయని అంచనా. ఇప్పటి వరకు రెండు వరుసల సస్పెన్షన్ బ్రిడ్జిల మాత్రమే ఉండగా ఈ వంతెన నాలుగు వరుసలతో నిర్మిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా పర్యాటకులు నడిచేందుకు గాజు ప్యానెల్స్‌తో కూడిన డెక్ ఏర్పాటు చేయబోతున్నారు.
హైదరాబాద్ నుంచి కల్వకుర్తి, నాగర్ కర్నూలు మీదుగా కొల్లాపూర్ దాటాక సోమశిల మీదుగా కృష్ణా నది దాటితే సంగమేశ్వరం, ఆత్మకూరు మీదుగా నంద్యాల వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి పూర్తయితే తెలంగాణలోని మల్లేశ్వరం, ఆంధ్రప్రదేశ్‌లోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలు అనుసంధానం అవుతాయి. రెండు ప్రాంతాల శైవభక్తులు శివరాత్రి, ఉగాది తదితర పర్వదినాల సమయంలో పుణ్యక్షేత్రాలను సందర్శించడం సులువవుతుంది.
దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికంగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ బెంగలూరు జాతీయ రహదారి మీద కేంద్రీకృతమైన పరిశ్రమలు ఇక సోమశిల వైపు పయనమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ రహదారి మీదుగానే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సైబరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్ సిటీలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయలని ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందుకోసం రెండు రోజుల క్రితమే కొన్ని గ్రామాలను Hyderabad Metropolitan Development Authority(HMDA) పరిధిలోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి సొంత ఇలాకా నుంచి వెళ్లే రహదారి కావడంతో ఫ్యూచర్ సిటీ తొందరలోనే పట్టాలు ఎక్కనుంది. సోమశిల వెళ్లే జాతీయ రహదారికి భూ సేకరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా చూపించే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భూముల ధరలు ఆకాశాన్నంటాయి. సోమశిల బ్రిడ్జిని కలిపే జాతీయ రహదారి, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీతో శ్రీశైలం రహదారిలో కూడా రియల్ భూమ్ ఊపందుకుంటుంది.