డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సామాజిక వర్గానికి చెందిన మాలజంగం మహేశ్వర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మార్వో ద్వారా ఎలాంటి షరతులు లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ మాజీ చీఫ్ వి హన్మంత్ రావు విజ్ఞప్తి చేశారు. హైద్రాబాద్, బషీర్‌బాగ్ లో తెలంగాణ రాష్ట్ర మాలజంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హన్మంత్ రావుతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షుడు పార్శా శ్యామ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలు తమ కులానికి అందేలా చూడాలన్నారు. అలాగే తమ కుల దైవం వేములవాడ రాజన్న సన్నిధిలో భవన నిర్మాణానికి స్థలం ఇప్పించాలని కోరారు. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా తమ కులాలకు స్వాతంత్రం రాలేదన్నారు. ఏ ప్రభుత్వాలు నిమ్న జాతులను మనుషులుగా గుర్తించకుండా ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో తమ కులం ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఎవరి జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభా ప్రాతిపదికన రాజకీయ, ఉద్యోగ ఫలాలు పంచాలన్నారు. చేసుకోవడానికి వ్యవసాయం, ఉండటానికి ఇల్లు, ఉద్యోగాలు లేవన్నారు. అన్ని కులాల వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతుంటే తమకు కుల ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. ఆర్డీవో ద్వారా కాకుండా ఎమ్మార్వో ద్వారా కుల ధృవీకరణ పత్రాలు, మూడెకరాల వ్యవసాయ భూమి, కళా కారులకు పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు బ్యాంకుల్లో ఏ పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు నిమ్మ సదానందం, కొండ మచ్చెందర్, కార్యనిర్వహణ అధ్యక్షులు పీసరి సత్యానందం, వేముగంటి నాగభూషణం, ప్రచార కార్యదర్శి కోదాది భూమయ్య, కోశాధికారి ఏల్పుల నాగరాజు, సహాయ కార్యదర్శి గౌడి చిరంజీవి, సాంస్కృతిక కార్యదర్శి రామిల్ల గురుపాదం, వివాహ పరిచయ వేదిక కన్వీనర్ గౌడి యోగేశ్వర్ పాల్గొన్నారు.