22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

గిగ్‌ వర్క్స్‌ చట్టం ముసాయిదా సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముసాయిదా బిల్లును రూపొందించి, అభ్యంతరాలు ఆహ్వానిస్తోంది. తుది బిల్లును ఆ అభిప్రాయాల ఆధారంగా రూపొందించి అమలు చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ బిల్లు తమ అవసరాలను పూర్తిగా ప్రతిబింబించలేదని గిగ్ వర్కర్స్ యూనియన్‌ ప్రతినిధులు అంటున్నారు. నీతి ఆయోగ్‌ 2022లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020-21 నాటికే దేశంలో 77 లక్షల మంది గిగ్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ సంఖ్య 2029-30 నాటికి 2.35 కోట్లకు చేరుతుందని అంచనా వేయగా, వారిలో 6.7% శాతం శ్రామిక రంగంలో భాగమవుతారని పేర్కొంది.

తెలంగాణలో సుమారు 4.20 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి సంస్థల డ్రైవర్స్, డెలివరీ ఏజెంట్లు, ఫ్రీలాన్స్, పార్ట్‌టైం వర్కర్లు ఈ విభాగంలోకి వస్తారు. ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ గిగ్ అండ్‌ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్‌ వెల్ఫేర్) యాక్ట్ 2025’ ముసాయిదా ప్రకారం, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బోర్డు చైర్‌పర్సన్‌గా, వివిధ శాఖల ఉన్నతాధికారులు, గిగ్ వర్కర్ల ప్రతినిధులు, ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. డేటా కలెక్షన్, ఐటీ వ్యవస్థల పరంగా నిపుణుడిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు.

ప్రతి గిగ్ వర్కర్‌కు రిజిస్ట్రేషన్‌తో యూనిక్ ఐడీ ఇస్తారు. ప్లాట్‌ఫామ్‌లు ఈ చట్టం అమలులోకి వచ్చిన 45 రోజుల్లో తమ సంస్థలను బోర్డులో నమోదు చేసుకోవాలి. సంస్థలు వేతనాల్లో కోత పెట్టినట్లయితే, వాటిని ఇన్‌వాయిస్‌లో చూపించాల్సి ఉంటుంది. ఉద్యోగుల తొలగింపు విషయంలో ఏడు రోజుల రాతపూర్వక నోటీసు అవసరం. కానీ వినియోగదారుడికి హాని జరిగితే సంస్థలు వెంటనే తొలగించే అధికారం కలిగి ఉంటాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రతినిధిని నియమించాలి.

తెలంగాణ గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లు ఇవ్వడంతో పాటు సంస్థలు, వర్కర్లు అందించే విరాళాలను జమ చేస్తారు. ప్లాట్‌ఫామ్‌ల నుంచి వసూలు చేసే ఫీజు వేతనాల్లో 1% కంటే తక్కువ, 2% కంటే ఎక్కువ ఉండకూడదు. డబ్ల్యూఎఫ్ఎఫ్వీఎస్‌ అనే వెరిఫికేషన్ వ్యవస్థ ద్వారా లావాదేవీలన్నీ పర్యవేక్షిస్తారు. ఫీజు చెల్లించని సంస్థలకు ఏడాది జైలు లేదా రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. సమాచారం ఇవ్వని సంస్థలకు రూ.50 వేల వరకు జరిమానా విధించవచ్చు.

గిగ్ వర్కర్లు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి హక్కులు చట్టంలో స్పష్టంగా పేర్కొనాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా పాలసీని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. బోర్డుకు సలహాలకే పరిమితి కాకుండా, పర్యవేక్షణ, జరిమానాలు విధించే అధికారం ఇవ్వాలని సలావుద్దీన్ సూచించారు. 2023 నవంబరులో ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో సమావేశమై ప్రత్యేక చట్టానికి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం చట్టం తీసుకురానుంది. ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు ఇలాంటి చట్టాలు అమలు చేశాయి. బీమా, ప్రమాద భద్రత కల్పించాలని కోరుతున్నారు.

ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు పంపేందుకు ఏప్రిల్ 29 నుంచి మూడు వారాల గడువు ఉంది. [tg.gig.labour@gmail.com]కు మెయిల్ చేయవచ్చు లేదా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో రాతపూర్వకంగా అభ్యంతరాలు ఇవ్వవచ్చు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com