అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రవి శనివారం కన్ను మూశారు. ఆయన కొంతకాలంగా వృద్దాప్య అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ప్రముఖ భరత నాట్య గురు కలైమామణి పార్వతి వారి శ్రీమతి. కుమారుడు మొహిందర్ ఘంటసాల బెలజియం లావెన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. సోమవారం చెన్నై లో అంత్యక్రియలు జరుగుతాయని ఘంటసాల పార్వతి తెలిపారు.
ఘంటసాల రవి సౌండ్ ఇంజనీర్ గా పని చేశారు. చాలా సౌమ్యులు! సంగీత నృత్య ప్రియులు. భార్య పార్వతి నాట్యరంగంలో విశేషంగా రాణించడానికి, దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి రవి చాలా ప్రోత్సాహం అందించారు. ఆమె నిర్వహిస్తున్న కళా ప్రదర్శిని నృత్యాలయం ద్వారా ప్రతి యేటా ఘంటసాల జయంతి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ లలో నిర్వహిస్తూ వివిధ రంగాల ప్రముఖులకు ఘంటసాల పురస్కారాలు ఇస్తూ గౌరవిస్తూ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు! అమర గాయకుడు ఘంటసాల స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చవటపల్లి .