కోట్లు ఉన్నప్పటికీ ప్రయోజనం ఏముంది? జీవితంలో ఎక్కువ భాగం జైలుకే పరిమితమయితే ఇక సంపాదించింది అనుభవించడం కూడా లేని అది దరిద్రమైన జాతకం గాలి జనార్థన్ రెడ్డిది. అక్రమంగానో.. ఎలాగోనో గాలి జనార్థన్ రెడ్డి కోట్లాది రూపాయలు కూడబెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గాలి కుటుంబం కర్ణాటకు వెళ్లి సెటిలయింది. కర్ణాటకలో అనేక వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయలను కూడబెట్టింది. గాలి జనార్థన్ రెడ్డికి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో ఆయన కుమార్తె వివాహంలో చేసిన హంగూ ఆర్భాటాలు చూస్తేనే అర్థమవుతుంది. బంగారు పళ్లేలు, నగలు, నట్రా.. ఇలా ఒకటేమిటి.. బంగారంతో పొదిగిన విలువైన వస్తువులు. కాలుకదిపితే ఏ కారు వస్తుందో ఆయనకు కూడా తెలియదు. ఇక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఏసీల్లోనే సేదతీరతారు.
అలాంటి గాలి జనార్థన్ రెడ్డి ఇప్పుడు చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో నలుగురికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానాను కూడా విధించింది. గతంలో కొన్నేళ్ల పాటు గాలి జనార్థన్ రెడ్డి శిక్ష అనుభవిస్తూ జైలు జీవితం గడిపారు. ఆ శిక్ష మినహాయించాలని కోరినా న్యాయస్థానం ఒప్పుకోలేదు. బిజినెస్ మాగ్నెట్ గాలి జనార్థన్ రెడ్డి జైల్లో ఉక్కపోతకు మగ్గిపోతున్నారట. తనకు జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలంటూ పిటీషన్ వేశారు. గాలి పిటీషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఈ కేసులో విచారించి ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ గాలి జైలు జీవితం గడపలేకపోతున్నారని అర్థమవుతుంది.
తనకు ఇంటి భోజనంతోపాటు బెడ్, ఫ్యాన్ తో పాటు మరికొన్ని సౌకర్యాలు కోరుతున్నారు. దీంతో రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం కూడా లేనట్లే. అందుకు జనార్దన్ రెడ్డి స్పందిస్తూ.. వయసు, తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి, శిక్ష తగ్గించాలని కోరారు. జడ్జి స్పందిస్తూ..’ఈ కేసులో పదేళ్ల శిక్ష ఎందుకు వేయకూడదు’ అని ప్రశ్నించారు. నాలుగేండ్లకు పైగా సామాజిక సేవ చేస్తున్నానని.. బళ్లారితో పాటు గంగావతిలో కూడా ప్రజలు తనను అఖండ మెజారిటీతో గెలిపించారని ఈ సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. తన సేవలను గుర్తించినందుకే ప్రజలు గెలిపించారని చెప్పారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం.. చివరకు ఆయనకు ఏడేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమ తవ్వకాల కేసు సంచలనం సృష్టించింది. ఏపీ అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సీబీఐ ఈ కేసును విచారించి.. పలువురిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీ ఖాన్, ఓఎంసీ కంపెనీని దోషులుగా నిర్ధారించింది. వీరికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలానే ఈ కేసుకలో ఆరోపణలు ఎదుర్కొన్న సబితా ఇంద్రారెడ్డి, కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని హైకోర్టు నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.