తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీ ఏర్పాటయ్యింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఈ కమిటీని నియమించారు. ఈనెల 14వ తేదీనే ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవో షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో విపత్తు నివారణకు ప్రణాళికలు, వాతావరణ మార్పుల ప్రభావం విశ్లేషణ, రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల్లో అంతరాలు, అభివృద్ధి విశ్లేషణ, పైలెట్ ప్రాజెక్టులు, పరిశోధనలు నిర్వహించడం ఈ సలహా కమిటీ ప్రధాన ఉద్దేశ్యం. ఈ కమిటీ విశ్లేషణలు రాష్ట్రంలో స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలకు మద్దతుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. మొత్తం తొమ్మిది మంది తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రణాళిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ సలహా కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ హిమాంశు, డాక్టర్ సుఖదేవ్ తొరాట్, నిఖిల్ దేవ్, ప్రవీణ్ చక్రవర్తి, ప్రొఫెసర్ భూక్య, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సభ్యులుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.