వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, ప్రభుత్వ అనుమతులు లేకుండానే అనేక విదేశీ పర్యటనలు చేసిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకున్నప్పటికీ, ఆ అనుమతులను డివియేట్ చేసి సునీల్ కుమార్ దుబాయ్‌లో పర్యటించినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు, 2023 సెప్టెంబర్ 2న ఎమిరేట్స్ విమానం EK 525 ద్వారా హైదరాబాద్ నుంచి స్వీడన్‌కు వెళ్లి, సెప్టెంబర్ 11న EK 526 విమానం ద్వారా తిరిగి వచ్చినట్లు గుర్తించారు. ఈ ప్రయాణానికి ఆయన ప్రభుత్వం నుండి అనుమతి పొందలేదు.
అదే విధంగా, 2023 ఫిబ్రవరి 1న EK 525 విమానం ద్వారా హైదరాబాద్ నుండి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి, ఫిబ్రవరి 28న EK 524 విమానం ద్వారా తిరిగి వచ్చినప్పటికీ, ఈ ప్రయాణానికి కూడా సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతులు పొందలేదని తేలింది. అంతకుముందు, 2022 డిసెంబర్ 14 నుండి 19 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకున్నప్పటికీ, దుబాయ్‌లోనే పర్యటించినట్లు ప్రభుత్వ విచారణలో వెల్లడైంది.
ఇప్పటివరకు గుర్తించిన ఉల్లంఘనలలో 2021 అక్టోబర్ 2న EK 525 విమానం ద్వారా హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి, అక్టోబర్ 10న EK 524 విమానం ద్వారా తిరిగి రావడం కూడా ఉంది. ఈ ప్రయాణానికి కూడా ఆయన అనుమతి పొందలేదు. అంతేకాదు, 2019 డిసెంబర్ 21 నుండి 2020 జనవరి 4 వరకు అమెరికా పర్యటనకు అనుమతి తీసుకుని, అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్‌లో పర్యటించినట్లు గుర్తించారు.
ఈ విదేశీ పర్యటనలు అనుమతుల మేరకు జరగకపోవడంతో, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం ఈ రోజు సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.