ఒక మహిళ చదువుకుంటే, ఒక కుటుంబం ఎదుగుతుందనే మాట వెనుక గల సత్యాన్ని ప్రధానమంత్రి ముద్ర యోజన స్పష్టంగా నిరూపించింది. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వేలాదిమంది స్త్రీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. గతంలో పెరిగిన ఖర్చులు, పెట్టుబడి లేమి, అవగాహన కొరత వంటివి మహిళలు తమ స్వంత వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద అడ్డంకులుగా ఉండేవి. అయితే ఈ పథకం మహిళల కలలను నిజం చేసే సాధనంగా మారింది.
ఇప్పటికే చాలా మంది మహిళలు ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా లభించిన రుణాలతో స్వంత టైలరింగ్ యూనిట్లు, బ్యూటీ పార్లర్లు, ఫుడ్ స్టాల్స్, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న షాపులు మొదలైనవిని ప్రారంభించారు. వీటితొ తాము మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధిని కల్పిస్తున్నారు. వ్యాపార స్థాయిలో వారిని నిలబెడుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నాయి. ఒక చిన్న ఆర్థిక సహాయం ఎంత పెద్ద మార్పుకు దారి తీస్తుందో ముద్ర యోజన నిరూపిస్తోంది.
ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇప్పటివరకు రుణం పొందినవారిలో 68% మంది మహిళలు ఉన్నారు. ఇది మహిళలలో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2016 నుంచి 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య మహిళల సిఏజిఆర్ 13% గా నమోదయ్యింది. అలాగే పొదుపు స్థాయిలో 14% వృద్ధి కనిపించింది. అంటే, వారు రుణాలను పొంది, అర్థవంతంగా వినియోగించడమే కాదు, పొదుపు కూడా చేసుకుంటున్నారు.
ఆర్థికంగా బలపడిన మహిళలు తమ పిల్లల చదువు, ఆరోగ్యం మీద ఖర్చు చేయగలుగుతున్నారు. ఇది వారి కుటుంబ అభివృద్ధితోపాటు భవిష్యత్తు తరాల ఎదుగుదలకూ దోహదపడుతుంది. అంతేకాదు.. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఈ విధంగా ప్రధానమంత్రి ముద్ర యోజన లక్షలాది మహిళలకు కొత్త జీవితం ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మార్గంలో మరింత ముందుకు వెళ్లాలంటే ప్రభుత్వ, బ్యాంకింగ్, నాన్-గవర్నమెంటల్ సంస్థల సమన్వయం మరింత అవసరం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.