22.7 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

ఏఐ టూల్స్ వినియోగంపై ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు

  • చాట్ జీపీటీ, డీప్ సీక్ లపై నిషేధం

  • ఆర్ధిక శాఖ ఉద్యోగులెవరూ అధికారికంగా వాడొద్దు

  • సమాచారం చోరీకి గురయ్యే ఛాన్స్

  • ఓపెన్ ఏఐ చీఫ్‌ టూర్‌ నేపధ్యంలో నిర్ణయం

  • ఆఫీస్ ఫోన్లు, డెస్క్ టాప్ లపై డౌన్ లోడ్‌ కూడా వద్దు

  • కీలక డాక్యుమెంట్లు, డాటాకు రిస్క్

  • ఇప్పటికే నిషేధం విధించిన ఆస్ట్రేలియా, ఇటలీ

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ యాప్‌ల వాడకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ నిషేధించింది. డేటా భద్రతా సమస్యలే దీనికి కారణమని మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఛాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్‌ జెమిని వంటి ఏఐ టూల్స్‌కు ఉద్యోగులు ఇకపై దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది.

మనం చేయాల్సిన పనిని సులభతరం చేస్తున్న, అత్యంత వేగంగా చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టూల్స్‌ వాడకం గత కొంత కాలంగా భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా భారతదేశంలో ఉద్యోగులు, వృత్తి నిపుణులు ఈ టూల్స్‌ను విరివిగా వినియోగించుకుంటున్నారు. అయితే, ఇలా.. ఏఐ టూల్స్‌ వినియోగిస్తున్న సమయంలో మన డేటా సేఫ్టీ, కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించి అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టూల్స్‌ ఉపయోగించాలంటే మన డివైజ్‌లు, కంప్యూటర్లలో డేటాకు యాక్సెస్‌ చేసుకునే పర్మిషన్‌ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో, మన డివైజ్‌లలో, కంప్యూటర్‌లలో ఉన్న డేటా లీక్‌ అయ్యే ప్రమాదం అధికంగా ఉంది. అందుకే జాతీయ భద్రత, సున్నితమైన, గోప్యమైన సమాచారం భద్రత నేపథ్యంలోనే ఏఐ రంగంలో అత్యాధునిక టూల్స్ అయిన చాట్ జీపీటీ, డీప్ సీక్ లను ఆర్థిక శాఖ ఉద్యోగులు తమ ఆఫీసు మొబైళ్లపై వినియోగించవద్దని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ ఏఐ టూల్స్ ను వినియోగిస్తే కీలకమైన డాటా, ఇతర సమాచారం తస్కరణకు గురి కావచ్చని,వాటితో ప్రమాదం పొంచి ఉందని తెలిపింది.

ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్ మన్ తొందరలోనే మనదేశంలో పర్యటించనున్న నేపధ్యంలో ఆర్ధిక శాఖ ఈ సలహాను ఇచ్చింది. ప్రభుత్వ సమాచారం విశ్లేషణకు లేదా మరే ఇతర వినియోగం కైనా చాట్ జీపీటీ, డీప్ సీక్ లను వాడొద్దని ప్రభుత్వానికి చెందిన కీలకమైన డాక్యుమెంట్లు, డాటా చోరీకి గురయ్యే రిస్క్‌ ఉందని ఆర్థిక శాఖ తన అంతర్గత ఆదేశాలలో ఉద్యోగులకు సూచించింది. డాటా సెక్యూరిటీ రిస్క్‌లకు గురయ్యే ఆస్కారముందని ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి దేశాలు కూడా డీప్ సీక్‌ ను వాడొద్దని గతంలోనే తమ దేశంలో ఆదేశాలు జారీ చేశాయి. ఆర్థిక శాఖ ఆదేశాల వ్యవహారం ఇవాళ సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. శాం ఆల్ట్ మన్ భారత ఐటీ మంత్రిని కూడా తన పర్యటనలో కలవబోతున్నారు. ఆర్థిక శాఖ ఉద్యోగులు తమ ఆఫీస్ డెస్క్‌టాప్‌లపై లేదా మొబైళ్లపై ఈరెండు ఏఐ టూల్స్ ను అసలు డౌన్‌లోడ్ చేయొద్దని , ఏ పనికోసం అయినా వాటిని వాడొద్దని కేంద్ర ఆర్థిక శాఖ జనవరి 29నే ఆదేశాలు జారీ చేసింది. ఆర్ధిక శాఖ ఆదేశాలు నిజమేనని.. అయితే ఇవి అంతర్గత ఆదేశాలని ముగ్గురు ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులు కూడా అంగీకరించారు.

అయితే, ఈ ఆదేశాలు ఆర్థిక శాఖకే పరిమితమా లేక ఇతర శాఖల్లో కూడా ఇచ్చారా అన్నది తెలియరాలేదు. మరోవైపు ఓపెన్ ఏఐ టూల్‌ పై మన దేశంలో కాపీరైట్‌ ఉల్లంఘనల వివాదం నడుస్తోంది. డీప్ సీక్ కు మన దేశంలో అసలు సర్వర్లే లేవని కాబట్టి దానికి సంబంధించిన కేసులు అసలు విచారణకు స్వీకరించవద్దని దేశంలో పెద్ద మీడియా హౌసులు ఇప్పటికే సుప్రీం కోర్టుకు నివేదించాయి.

భారతదేశంలో ఓపెన్ ఏఐ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అనేక దిగ్గజ మీడియా సంస్థలు ఓపెన్‌ ఏఐ కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసులు దాఖలు చేశాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఏఐ వాడకంపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకోవడపై సాంకేతిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. AI సాధనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ డేటా గోప్యత, సైబర్ భద్రతకు సంబంధించిన కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రపంచదేశాలతో పోటీపడాలంటే స్వదేశీ ఏఐ పరిజ్ఞానంతో సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com