భారత్-పాక్ సరిహద్దుల్లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. జమ్ము కశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ అక్నూర్ సెక్టార్‌లోని వద్ద భద్రతాబలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. పేలుడు జరిగిన వెంటనే గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్‌ను ఉపయోగించారు. అయినా కానీ వారి ప్రాణాలు దక్కలేదు.
ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను మోహరించింది ఇండియన్ ఆర్మీ. ఆ ప్రాంతంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతంలో ఈరోజు ఉదయమే ఓ మోర్టార్ షెల్‌ను డిఫ్యూజ్ చేశారు జవాన్లు. మోర్టార్‌ను గమనించిన సమీప ప్రాంత ప్రజలు వెంటనే ఆర్మీ అధికారులకు సమాచారమిచ్చారు. దాన్ని డిఫ్యూజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ పేలుడు జరిగింది. దీంతో అసలేం జరుగుతుందన్న దానిపై ఆర్మీ అధికారులు ఫోకస్ చేశారు. ఈ రోజు మృతి చెందిన వారిలో ఆర్మీ కెప్టెన్ కూడా ఉన్నారు.