ఆంధ్ర ప్రదేశ్‌లో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదంగా తయారయ్యింది. అనవసర విషయాల్లో అసలే జోక్యం చేసుకోవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్ర స్థాయిలో కొందరి తీరు మారడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు సీఎం ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇదే తీరులో ఓ ఎమ్మెల్యే వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది.
తన నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న రామాయపట్నం పోర్టు పనుల్లో తనకు వాటాలు ఇవ్వాల్సిందేనని ఆ ఎమ్మెల్యే తేల్చి చెబుతున్నారట. అయితే, పోర్టు పనులు నిర్వహిస్తున్న సదరు కాంట్రాక్టు సంస్థ ఎమ్మెల్యే డిమాండ్‌ను పట్టించుకోక పోవడంతో ఆ ఎమ్మెల్యే తన ప్రతాపాన్ని చూపుతున్నారని చెబుతున్నారు. రామాయ పట్నం పోర్టు నిర్మాణానికి తరలిస్తున్న కంకర, ఇసుక లారీలను ఆయన అనుచరులతో అడ్డగిస్తున్నారని చెబుతున్నారు. అలాగే, ఆ సంస్థ సిబ్బంది, లారీల డ్రైవర్లు, సిబ్బందిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు దిగుతున్నారట. ప్రతి ట్రిప్పునకు వెయ్యి రూపాయలు తనకు ఇవ్వాల్సిందేనని ఆ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.
దీంతో, ఈ వివాదం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందని చెబుతున్నారు. అయితే, సీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ ఆ ఎమ్మెల్యే మాత్రం వెనక్కి తగ్గడం లేదంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి ఆదేశాలున్నా.. తన దందాను మాత్రం యధేచ్ఛగా కొనసాగిస్తుండడం చర్చ నీయాంశమవుతోంది. కూటమి ప్రభు్త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయపట్నం పోర్టు నిర్మాణంపై దృష్టి పెట్టింది. పోర్టు పనులు శరవేగంగా పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ, స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం సరికొత్త దందాకు దిగినట్లు టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వస్తున్నాయి. పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే ఇంటూరి కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఎమ్మెల్యే డిమాండ్‌కు సదరు కాంట్రాక్టు సంస్థ సమ్మతించలేదంటున్నారు. దీంతో, ఎమ్మెల్యే నాగేశ్వర్ రావు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టారట. కాంట్రాక్టు సంస్థను భయపెట్టి అయినా సరే.. తన దారికి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోర్టు నిర్మాణాల కోసం కంకర, ఇసుక సరఫరా చేస్తున్న లారీలకు అడ్డు పడుతున్నారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ అక్కడికి చేరకుండా చేయడం ద్వారా నిర్మాణ సంస్థను తన దారికి తెచ్చుకోవాలన్నది ఎమ్మెల్యే లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, తనకు రావాల్సిన వాటాల కోసం పెద్ద డిమాండ్లనే తెరపైకి తెచ్చారట ఇంటూరి నాగేశ్వరరావు. కానీ, అవేవీ వర్కవుట్ కాకపోవడంతో.. నయా దందాకు దిగారట. తన డిమాండ్లకు ఒప్పుకోవడం లేదు కాబట్టి.. ఒక్కో లారీ ట్రిప్పునకు వెయ్యి రూపాయల చొప్పున తనకు చెల్లించాలని డిమాండ్ చేశారట. అయితే సదరు సంస్థ ఆ డిమాండ్‌కు కూడా ఒప్పుకోకపోవడంతో పోలీసులను అడ్డం పెట్టుకొని లారీలను రోడ్డుపై నిలిపివేయిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు.. తప్పుడు కేసులు పెడుతున్నారట. పోర్టు పనులు ముందుకు సాగకుండా అరాచకం సృష్టిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఈ దందా గురించి ప్రకాశం జిల్లా నేతలు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. చాలామంది ఇప్పటికే నేరుగా ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. దీనిపై సీఎంఓ సీరియస్ గా స్పందించింది. జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినా.. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అరాచకం మాత్రం ఆగడం లేదని చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారో మరి…