భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం ఖరారైనట్లేనా? మొత్తానికి ఢిల్లీ పెద్దల దృష్టిలో ఈటలే సమర్థుడన్న ఆలోచన వచ్చిందా? రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు, అధికార కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలంటే ఈటల రాజేందరే సరైన నాయకుడని బీజేపీ పెద్దలు డిసైడయ్యారా? దాదాపు యేడాది కాలంగా ఊరిస్తూ వచ్చిన బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెర దించబోతోందా? జరుగుతున్న పరిణామాలు, ముఖ్యనేతల ప్రకటనలు, జస్టిఫికేషన్లు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వచ్చేలా చేస్తున్నాయి. కాలం కలిసొస్తే వారం రోజుల్లోనే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠంపై ఈటల రాజేందర్ కూర్చోబోతున్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. పలు అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కీలక అంశాలపై అధిష్టానం ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వం వైఖరిని వెల్లడించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ప్రస్తావన కూడా వచ్చింది. ఈ అంశంలో కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షపదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని అందరు నేతల అభిప్రాయాలు తీసుకుంటుందని, నేతలందరి ఏకాభిప్రాయంతోనే బీజేపీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్నారు. అలాగే.. మరో స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.వారం రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. ఇంకో విషయంలోనూ కిషన్‌రెడ్డి అధిష్టానం ఆలోచనను కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యే నాయకుడికి ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఏదీ లేదని చెప్పారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్ అయ్యింది. మొదటినుంచీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయన బీఆర్‌ఎస్‌నుంచి బీజేపీలో చేరారు. ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అసలే లేదు. బీజేపీలో కూడా పెద్ద సీనియర్ కాదు. కానీ, కిషన్‌రెడ్డి ఇచ్చిన క్లారిటీతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఈటల రాజేందరే అన్న అంశం తేలిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఉద్యమపార్టీగా టీఆర్‌ఎస్ ఆవిర్జావం తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మల్కాజ్‌గిరి ఎంపీగా కొనసాగుతున్నారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండు సార్లు రాష్ట్రమంత్రిగా పనిచేశారు. ఓ దశలో కేసీఆర్‌కు రైట్ హ్యాండ్‌గా.. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. దీంతో, కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన అనుభవం ఉండటంతో ప్రభుత్వ నిర్వహణలో ముఖ్యమైన అంశాలపైనా ఈటలకు పట్టు ఉందని చెబుతారు. అందుకే ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సరైన నాయకుడన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందంటున్నారు.
వాస్తవానికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కమలాపూర్ నియోజకవర్గం నుంచి.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం నుంచీ ప్రతిసారీ ఈటల రాజేందర్ గెలుపొందుతూ వస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందడం ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అప్పుడు అధికారపార్టీ బీఆర్‌ఎస్ పూర్తి అధికార యంత్రాంగాన్ని, రాజకీయ మందీమార్బలాన్ని దించినా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపును ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. దీంతో ఈటలకు రాష్ట్రవ్యాప్తంగా అంతకుముందు ఉన్న గుర్తింపు రెట్టింపయ్యింది. కేసీఆర్‌ను ఓడించిన ఈటల రాజేందర్‌గా వినుతికెక్కారు. ఇక, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజవకర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కేంద్రమంత్రి పదవి, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో మొదటినుంచీ ఉంటున్నారు. కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కన్ఫామ్ అనే వాదనలు కూడా వచ్చాయి. కానీ, బండి సంజయ్ తర్వాత అధిష్టానం అనూహ్యంగా కిషన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలోనూ కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పరోక్షంగా ఈటల రాజేందరే రాష్ట్ర అధ్యక్షుడన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో, ఈటల శిబిరంలో ఉత్సాహం నెలకొంది.