- అన్నీ ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చా
- అణచివేతలో కూరుకుపోయిన వారిని బయటపడేస్తా
- బడ్జెట్ సమావేశాల చివరి రోజు అకట్టుకున్న భట్టి ప్రసంగం
ఒక ఫ్యూడల్ వ్యవస్థలో, భావ దారిద్రం, అణచివేతలో కూరుకుపోయిన వారిని బయటపడేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌సమావేశాల చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి చాలా సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను యాదృచ్ఛికంగా పొలిటికల్ లీడర్ను కాలేదు.. చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. సమసమాజ స్థాపనతోనే అభివృద్ధి ఉంటుందని, అది జరగాలంటే చట్టసభల ద్వారానే సాధ్యమని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజల జీవన విధానం బాగుపడాలని అంతా ఆత్మగౌరంతో జీవించడం కోసం రాజకీయాల్లోకి వచ్చా.. మీలాగా వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదు. వచ్చిన అవకాశాన్ని సమ సమాజ స్థాపన కోసం వినియోగిస్తాను.. మీలాగా దుర్బుద్ధితో రాజకీయాల్లోకి రాలేదు అని తీవ్ర స్ధాయిలో బీఆర్‌ఎస్ సభ్యుల ఆరోపణలకు సమాధానం చెప్పారు.
బయట చాలా మాట్లాడుతారు అని వాటిని పట్టుకువచ్చి మీరు సభలో ప్రస్తావిస్తున్నారని… అదే మేము మాట్లాడడం మొదలుపెడితే మీ కన్నా ఎక్కువ మాట్లాడగలమని భట్టి హెచ్చరించారు. గంజాయి రాజు, లిక్కర్ రాణి అని బయట చాలా మాట్లాడుతున్నారు.. అవి సభలో మేము మాట్లాడం సభ్యత కాదన్నారు. ఆర్థిక శాఖలో జరిగిన ఆర్థిక విధ్వంసం మొత్తం తవ్వితీస్తానని.. ఉన్న విషయాలు సభలో రాష్ట్ర ప్రజల ముందు పెట్టి వివరిస్తానని భట్టి విక్రమార్క చెప్పారు. మీ 10 సంవత్సరాల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, శ్రీ శిశు సంక్షేమం కోసం 70,474 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేద, అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కింద 50 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు మీరు చేయలేదని గత ప్రభుత్వాన్ని ఏకిపారేసారు.
మేం అధికారంలోకి రాగానే ఆర్థిక, సామాజిక, రాజకీయ సర్వే జరిపించాం.. రాష్ట్రంలో 86% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి మీరు నిధులు ఖర్చు చేయలేదని నిర్ధారణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే సంక్షేమం కోసం మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశాం. మూడు లక్షల 4 వేల కోట్ల బడ్జెట్లో 1,44,156 కోట్లు సంక్షేమం కోసం కేటాయించాం. మేం రాబడి నీ దృష్టిలో పెట్టుకొని ఆ మేరకే ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 40 వేల కోట్ల బిల్స్ మీరు పెండింగ్లో పెట్టి పోయారు.. ఉద్యోగుల బకాయిలు కాకుండానే 40 వేల కోట్లు పెండింగ్లో పెట్టారు. 1,59,940 లక్షల కోట్ల పనులు శాంక్షన్ చేసి పోయారు.. ఆ పనుల బిల్లులు పెండింగ్లో పెట్టి పోయారు… ఉద్యోగులు రిటైర్ అయితే భారం మీపై పడుతుందని మూడు సంవత్సరాలు పెంచారు. మొత్తం ఉద్యోగుల బకాయిలు 20వేల కోట్లు ఉండగా అందులో మేం 16 వేల కోట్లు క్లియర్ చేశామని డిప్యూటీ సీయం తెలిపారు.
మీరు లక్ష కోట్లు అప్పు తెచ్చి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.. మీరు తెచ్చిన అప్పులకు పదేళ్ల తర్వాత చెల్లింపులు ప్రారంభం అయ్యాయి.. ఆ లక్ష కోట్లు అప్పులు మాపై వదిలివేశారు.. పెండింగ్ బిల్స్ రీపేమెంట్ భారం మా ప్రభుత్వం పైపడింది. మీలాగా 20% అంచనాలు పెంచకుండా వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టామని బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపారు. లక్ష మంది అధికారులతో నభూతో న భవిష్యత్తు అన్నట్టు కుల సర్వే చేశాం.. ప్లానింగ్ శాఖను నేనే చూస్తున్నాను.. ఈ రాష్ట్ర వనరులు వెనుకబడిన పేద వర్గాలకు ఎలా పంచాలి అనే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ కు కమిట్మెంట్ ఉంది. కాబట్టి సర్వే పూర్తి చేశాం.. వనరులు రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం పంపిణీకి విశ్లేషణ చేస్తున్నామని భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు.
మీలాగా దోపిడీ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని. ఈ సమాజంలో కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదని.. వాళ్లకు వాటా దక్కాలని మా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని చెప్పారు. దశాబ్దాలుగా పరిష్కరించని సమస్యను మా సీఎం యావత్ క్యాబినెట్ పరిష్కరించిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం అందుకే బడ్జెట్లో 56,084 కోట్లు కేటాయించాం వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని భట్టి తేటతెల్లం చేశారు. రాష్ట్రం వస్తే మేలు జరుగుతుందని నిరుద్యోగులు ఆత్మార్పణం చేసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చాక 57,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసాం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసి తీరుతామన్నారు. పదేళ్లుగా మీరు స్వయం ఉపాధి పథకాలను పట్టించుకోలేదు. నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకున్న మేము 6000కోట్లతో స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టాం.. బ్యాంకు లింకేజీ తో కలిపి మొదటి ఏడాది తొమ్మిది వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు నిరుద్యోగులకు అందించబోతున్నామని భట్టి సభలో ప్రకటించారు. మీరు గతంలో వైశ్య కార్పొరేషన్ కు 25 కోట్లు, బ్రాహ్మణ పరిషత్ కు 50 కోట్లు కేటాయించగా మేముఈ బడ్జెట్లో దానిని 100 కోట్లకు పెంచాం మని పేర్కొన్నారు.
బడ్జెట్‌లో ఎస్సీ సబ్ ప్లాన్ కు 40 వేల కోట్లు కేటాయించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని చెప్పారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ అడ్డగోలుగా శాంక్షన్ లీటర్లు మీరు ఇచ్చి వెళ్లారు.. ఎన్నికల కోసం మీరు శాంక్షన్ లెటర్లు ఇస్తే.. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విదేశాల్లో వారు ఇబ్బందులు పడొద్దని మేము 169 కోట్లు విడుదల చేశామని తెలిపారు. మీ పాలనలో సంక్షేమ వసతి గృహాల పిల్లల డైట్ కాస్మోటిక్ చార్జీలను పట్టించుకోలేదు.. మేం అధికారంలోకి రాగానే 40 శాతం డైట్ చార్జీలు 25% కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి 11,600 కోట్లు కేటాయించాం. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నాంమని తెలిపారు. మండల జిల్లా పరిషత్తు పాఠశాలలు బాగు చేయడానికి విద్యా కమిషన్ నియమించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం.. విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా భావించి కార్యాచరణ చేపట్టామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో వివరించారు.