33.2 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

రూ.6వేల కోట్లతో 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి – సీఎం రేవంత్‌రెడ్డి

అట్టహాసంగా “రాజీవ్ యువ వికాసం” ప్రారంభం

పరిపాలన తీరును ప్రక్షాళన చేశాం

పారదర్శకతతో ప్రజా ప్రభుత్వం ముందడుగు

రాజీవ్‌ యువ వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

రూ.6000 కోట్లతో 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. శాసన సభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాజీవ్‌ యువ వికాసం కార్యక్రమాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో ప్రారంభించుకున్నామని చెప్పారు. ఈ 15 నెలల కాలంలో 57 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామన్నారు. 50 లక్షల కుటుంబాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు చూస్తున్నామని రేవంత్‌ తెలిపారు. 43 లక్షల కుటుంబాలు రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 1 కోటి 30 లక్షల నాణ్యమైన చీరలు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 29,500 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డలకు అప్పగించామన్నార. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. కులగణన నిర్వహించి ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకుంటున్నామని చెప్పారు. కులగణనలో బీసీల లెక్క 56.36 శాతంగా తేలిందని.. వారికి 42 శాతం రిజర్వేషన్లు అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చామన్నారు. ఈ బిల్లును కూడా ఆమోదించుకుని ఎస్సీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

తెలంగాణలో పరిపాలనను ప్రక్షాళన చేస్తూ…పారదర్శక విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు రేవంత్‌ రెడ్డి. ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదని, అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపదలచుకోలేదని.. అందుకే దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామన్నారు. ఇసుక, ఇతర విధానాలను స్ట్రీమ్ లైన్ చేస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌ వెల్లడించారు. గతంలో ఇసుకపై ప్రభుత్వానికి కోటిన్నర ఆదాయం వస్తే… ఇవాళ ఇసుక ఆదాయం మూడున్నర కోట్లకు పెరిగిందన్నారు.

పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్‌. నిరుద్యోగసమస్యను 8.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించుకున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ఇన్‌ఫ్లేషన్ లో 1.3 తో దేశంలోనే తెలంగాణ ముందు ఉందన్నారు. ఇది తాము చెప్పుకుంటున్నది కాదని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గణాంకాలని రేవంత్‌ స్పష్టం చేశారు.

రాజీవ్ యువ వికాసం ద్వారా యువకులకు. రూ. 50వేల నుంచి రూ.4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామన్నారు. జూన్ 2వ తేదీన లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కలిగించొచ్చన్నారు. నిజమైన నిరుద్యోగులకు ఇది అందాలని, వారికిది ఉపయోగపడాలన్నారు. ఉద్యోగాల భర్తీ, టీచర్ల బదిలీలు ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా నిర్వహించామని గుర్తు చేశారు. పథకాల అమలులో పారదర్శకంగా ఉండాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతామన్నారు.

తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇది పార్టీ పథకం కాదని, ప్రజల పథకమని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com