న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ఎమ్మార్ సంస్థ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమోదించారు. పలు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రాజెక్టులకు అడ్డంకులను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎమ్మార్ ప్రాపర్టీస్ యజమానులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వప్రధానకార్యదర్శి శాంతికుమారిలతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్ ప్రతినిధులు తమ సంస్ధకు సబంధించి ఉన్న న్యాయపరమైన అంశాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎమ్మార్ ప్రతినిధుల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందిస్తూ వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జీ షీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో చీఫ్ సెక్రటరీ నేత్రుత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని సీయం రేవంత్‌రెడ్డి చెప్పారు.
2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్ కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 అక్టోబర్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్ కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ఛీప్ సెక్రెటరీ సారధ్యంలో అయిదుగురు సెక్రెటరీల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
గురువారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారిలతో పాటుగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీయం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిలు పాల్గొనగా ఎమ్మార్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలబ్బర్, భారత్ లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్, ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్ లు పాల్గొన్నారు.