తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి ఏనుగులు స్వైరవిహారం చేశాయి. యర్రావారిపాలెం మండలం కోటకాడపల్లి పంచాయతీ అయ్యగారిపల్లెకు చెందిన పలువురు గ్రామస్తుల పంట పొలాలు నాశనం చేశాయి. గ్రామానికి చెందిన ఉప్పు జయనరసింహులు సహా.. పలువురు రైతులకు చెందిన దాదాపు 4 ఎకరాలు వరిపొలాన్ని ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. చేతికందాల్సిన సమయంలో వరిపంటను ఏనుగులు నాశనం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. అలాగే, ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు.. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలోని సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏనుగులు ఉన్ ప్రదేశాలకు ఎట్టిపరిస్థితుల్లో వెళ్ళకూడదని హెచ్చరించారు. ఏనుగుల దగ్గరకు వెళ్లి తరిమే ప్రయత్నం చేస్తే అవి ప్రతిఘటించి ప్రాణనష్టం కలిగించే ప్రమాదం ఉందని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. రైతులు తమ పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల ఆనవాళ్లు కనిపిస్తే అటువైపు వెళ్లొద్దని సూచిస్తున్నారు.