మయన్మార్‌ను భూకంపాలు విడిచి పెట్టడం లేదు. మళ్లీ అక్కడ భూమి కంపించింది. శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 1,600 మందికిపైగా చనిపోయారు. ఇప్పుడు మళ్లీ మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో భూ కంపం సంభవించింది. ఈ భూ కంపం తీవ్రత 5.1 గా నమోదయ్యింది. మళ్లీ ప్రకంపనలు చెలరేగడంతో ప్రజలు హాహా కారాలు చేశారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
శుక్రవారం నాటి శక్తి వంతమైన భూ కంపం ధాటికి దేశం అతలాకుతలమై పోయింది. రోడ్లు, బ్రిడ్జిలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నాయి. దీంతో, సహాయర చర్యలకు అంతరాయం కలుగుతోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. దీంతో, మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
మరోవైపు.. శనివారం మయన్మార్‌లో ఏకంగా మూడు భూకంపాలు సంభవించాయి. ఉదయం 11.53 గంటలకు 4.3 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకోగా, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత కాసేపటికే.. 20 నిమిషాల అనంతరం 4.7 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. దీంతో, మయన్మార్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.