తిరుమల కొండపై మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఇటీవల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ వీడియోలు రికార్డ్ చేసిన యూట్యూబర్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల కొండల మీదుగా తరచూ విమానాలు వెళ్తుండటం ఇటీవలి కాలంలో సర్వ సాధారణమైంది. ఏకంగా శ్రీవారి ఆలయం సమీపంలోనే విమానాల రాకపోకలు పలుమార్లు కనిపించడం భక్తులను కలవర పెడుతోంది. అలాగే, ఆనంద నిలయం పైనా ఎయిర్ క్రాఫ్ట్‌లు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల కొండపై విమానాలు ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధమన్న చర్చ ఎప్పటినుంచో ఉంది.
విమానాలు అటుంచితే ఇప్పుడు ఏకంగా డ్రోన్లతో విజువల్స్ రికార్డ్ చేస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్ అంచుమన్ తరేజా.. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద దాదాపు 10 నిమిషాల పాటు డ్రోన్ ఎగురవేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే విజిలెన్స్ అధికారులు స్పందించి అతన్ని అరెస్ట్ చేశారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
తిరుమల కొండపై విమానాలు, డ్రోన్ల ప్రయాణంపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమన్న వాదనల నేపథ్యంలో తిరుమల ప్రాంతాన్ని ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.