36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

అసంతృప్తా… వ్యూహాత్మకమా…?

  • సాయిరెడ్డి రాజీనామాపై చర్చోపచర్చలు
  • విజయసాయిరెడ్డి ప్రకటనతో ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు

వైఎస్సార్సీపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది… అదీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ఆ పార్టీలో కీలక నేత, జగన్‌కి అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించారు. ఇది వైఎస్సార్సీపీ క్యాడర్‌కి షాకింగ్‌ న్యూస్‌. ఆది నుంచి పార్టీలో దాదాపు నెంబర్‌ 2గా కొనసాగుతున్న నేత హఠాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని తన రాజ్యసభ పదవికి రాజీనామా చెయ్యడం… పార్టీ క్రియాశీల సభ్యత్వానికి కూడా రాజనామా చెయ్యడానికి సిద్దపడిపోవడంతో రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు…? పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల పట్ల నెలకొన్న పరిణామల పట్ల అసంతృప్తి వల్ల రాజకీయాలకు స్వస్తి చెప్పారా…? లేకపోతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహార సరళి కారణంగా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమా…? ఇవేవీకాకకుండా అధికారపక్షాల నుంచి ఏవైనా బెదిరింపులు వచ్చి వాటి వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నారా…? ఇలా అనేక ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మస్తిష్కాలను తొలిచెస్తున్నాయి.

వాస్తవానికి విజసాయిరెడ్డి స్వతహగా నిర్భయుడు. దేనికి భయపడే మనస్తత్వం కాదనేది ఆయన తెసున్నవాళ్లందరూ చెప్పేదే. అంటే అధికార పక్షాల బెదిరింపులు ఆయన దగ్గర పని చేయవు. ఇందుకు ఉదాహరణ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం జగన్మోహన్‌రెడ్డి మీద పెట్టిన అన్ని కేసుల్లో ఏ2 విజయసాయిరెడ్డే. ఆ సందర్భంలో అప్రూవర్‌గా మారమని విజయసాయిరెడ్డిపై తీవ్ర స్ధాయిలో ఒత్తిడి ఉండేది. సీబీఐ పాయింట్‌ బ్లాంక్‌లో ఆయనపై ఒత్తిడి తెచ్చింది. కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా అపరిమితమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. అయినా ఏనాడు రాజీ పడలేదు… నోరు మెదపలేదు. సంవత్సరం జైలు జీవితానికి సిద్దపడ్డారు కానీ జన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడలేదు. కాబట్టి ఎవరో భయపెడితే రాజకీయాలకు దూరం అవుతున్నారంటే నమ్మశక్యం కాదు. మరేంటి కారణం… పార్టీలో అంసతృప్తా..? అవకాశం ఉందని అంటున్నారు పార్టీ సీనియర్లు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తరువాత కడా పార్టీలో ఆయన ప్రభ అప్రతిహతంగా కొనసాగింది. ముఖ్యంగా 2014 – 19 టెన్యూర్‌లో వైఎస్సార్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సమయంలో విజసాయిరెడ్డి పాత్ర చాలా కీలకమైనది. అటు కేంద్రంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాలతో జగన్మోహనరెడ్డికి సత్సంబంధాలు నెలకొల్పడంతో పాటు పార్టీలో చేరికలకు ఆయనే బాధ్యుడు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డిని నియమించడం ద్వారా ఆయన ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పారు వైఎస్‌జగన్‌. అయితే కరోనా కాలం తరువాత విజసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడంతో కొంతమేర ఆయన అసంతృప్తికి లోనయ్యారని సాయిరెడ్డి సన్నిహితులు చెపుతుంటారు. ఇక అక్కడి నుంచి తనకు పార్టీలో ఎక్కడో ప్రాధాన్యత తగ్గుతోందనే భావం ఆయనలో అంతర్లీనంగా ఏర్పడిందనే ప్రచారం ఉంది. అలాగే 2024 ఎన్నికల్లో కూడా సాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంట్‌ స్ధానం నుంచి పోటీ చేయించడం ద్వారా తనను ఒక నియోజకవర్గానికి పరిమితం చేశారనే బాధ ఆయనలో కనిపించేదని పార్టీ వర్గాలు కూడా చెపుతున్నాయి.

గత ఎన్నికల ముందు క్షేత్ర స్ధాయిలో వాస్తవ పరిస్ధితులు ఎప్పటికప్పుడు జగన్‌ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకుండా ఐప్యాక్‌ టీమ్‌ చెప్పిన అభూత కల్పనలు నమ్మారు తప్ప తనను నమ్మలేదని తన సన్నిహితుల వద్ద ఆవేదనచెందేవారన్న ప్రచారం కూడా ఉంది. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైవీసుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిల మధ్య జరిగిన మూడు ముక్కలాటలో పార్టీ ఎంతగా నలిగిపోయిందో విజయసాయిరెడ్డి కూడా అంతే నలిగిపోయారనేది ఆయన మద్దతుదారుల వాదన. చివరికి ఎన్నికల తరువాత కూడా తనను పార్టీలో హ్యుమిలేట్‌ చేస్తున్నరన్న అనుమానం సాయిరెడ్డిలో ఉండేది. దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి విషయంలో టీడీపీ మీడియా తనను బద్‌నామ్‌ చేయాలని చేసిన ప్రయత్నాల వెనుక సొంత పార్టీకే చెందిన కీలక నేతలు ఉన్నారనే అనుమానాలను కూడా అప్పట్లో విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసిన తరవాత  విజయసాయిరెడ్డి పార్టీలో ఫుల్‌ శాటిస్ఫేక్షన్ తో ఉన్నారని చెప్పలేం. ఆయన రాజకీయల నుంచి తప్పుకోవడానికి ఇదికూడా ఒక కారణం కావచ్చు.

ఇక ప్రచారంలో ఉన్న మరో అంశం ఇది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమని. ఓ పక్కన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల నుంచి మొదలు రాష్ట్రంలో కీలక నాయకుల వరకూ ఎవ్వరు దొరికితే వారిని నల్లిని నలిపినట్లు నలిపి పడేస్తోంది. ఇప్పటికే చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నేతలపై అనేక కేసులు పెట్టి వేధిస్తోంది. ఈ దశలో పార్టీ క్యాడర్‌లో ధైర్యం మరింత దిగజారకుండా కేంద్రం నుంచి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టించడానికే సాయిరెడ్డి రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారనే వాదన ఉంది. వాస్తవానికి ఇప్పుడు సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవి కూటమిలోని ఏదో ఒక పార్టీకే దక్కుతుంది. అయితే ఈ ఖాళీ అయ్యే సీటును తన ఇష్టాను సారం ఎవరికైనా ఇచ్చే స్వతంత్రం ఇప్పుడు టిడీపీకి లేదు. విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయిన రాజ్యసభ స్ధానాన్ని భర్తీ చెయ్యాలంటే కూటమి భాగస్వామ్య పక్షాలైన బీజేపీ జనసేల అంగీకారం తప్పని సరి. గత నెల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న మూడు ఖాళీల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ ఖాతాల్లో భర్తీ చేశారు. ఈ సారి ఖాళీ అయిన స్ధానం ఖచ్చితంగా జనఖాతాలో పడాల్సిందే. ఇక్కడే అసలు మెలికంతా ఉందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. విజయసారియ తన రాజకీయ సన్యాసం ప్రకటించిన సందర్భంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తనకు మంచి మిత్రుడని ఆయన తనకు చెన్నైలో ఉన్న కాలం నుంచి తెలుసని ప్రకటించుకున్నారు. అలాగే తాను హిందూ ధర్మాన్ని పాటించేవాడినని అబద్దం అడనని పదే పదే చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన కావాలని చేసినా యధాలాపంగా చేసినా… రెండింటికీ రాజకీయ ప్రాధాన్యతను ఆపాదిస్తున్నారు ఆయన ప్రత్యర్ధులు. హిందువునని చెప్పుకోవడం, పవన్‌ కళ్యాణ్‌ మిత్రుడని చెప్పుకోవడం ద్వారా ఇకపై తన ప్రయాణం బీజేపీ మిత్ర బృందంతోనే అని విజయసాయిరెడ్డి స్పష్టం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు సూత్రీకరిస్తున్నారు. ఇదంతా వ్యూహంలో భాగంగానే 2019లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసిన మరుక్షణం ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు బీజేపీ పంచన ఎలా చేరిపోయారో అచ్చం అలాగే విజయసాయిరెడ్డి రాజీనామాను కూడా చూడాలనేది విశ్లేషకులు అభిప్రాయం. తన రాజీనామా ద్వారా ఖాళీ అయిన స్ధానంలో మళ్ళీ జనసేన తరపునో, బీజేపీ తరపునో విజయసాయిరెడ్డే పోటీ చేసే అవకాశంలేకపోలేదని వారంటున్నారు. అప్పుడు ఎన్‌డీఏ పక్ష సభ్యుడిగా వచ్చే నాలుగేళ్ళు జగన్మోహన్‌రెడ్డికి వైఎస్‌ఆర్సీపీకి రక్షణ కవచంలో విజయసాయిరెడ్డి ఉండబోతున్నారనే అనుమానాలు టీడీపీ క్యాడర్‌ నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఏతా వాతా విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com