తెలంగాణలో సినీ ఇండస్ట్రీ వ్యవహారంలో ప్రభుత్వం గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు కీలక ప్రకటన చేశారు. రేపు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవబోతున్నామని చెప్పారు. సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను కిమ్స్ ఆసుపత్రిలో వరుసగా రెండోరోజు దిల్‌రాజు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.శ్రీతేజ్ నిన్నటికి, ఇవాల్టి ఫాస్ట్‌గా రికవరీ అవుతున్నాడని దిల్‌రాజు చెప్పారు. అల్లు అరవింద్, సుకుమార్, పుష్ప నిర్మాతలు కలిసి శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని వెల్లడించారు.
సంధ్య థియేటర్ సంఘటన తర్వాత టాలీవుడ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. ఒక రకంగా సినీ ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వంగా పరిస్థితి మారిపోయింది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఇదే అంశం గురించి ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు తాను కూడా కలుస్తున్నానని దిల్ రాజు తెలిపారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా.. టాలీవుడ్ ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని దిల్ రాజు అన్నారు.