బెజవాడ కనకదుర్గమ్మ.. కొలిచిన వారికి కొంగు బంగారం. ఎంతో మందికి ఆరాధ్య దైవం. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అయితే, ఇంద్రకీలాద్రిపై అడుగడుగునా దోపిడీ తాండవిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి వెళ్లడం నుంచి మొదలుకొని.. దర్శనం తర్వాత తిరిగి కిందకు వచ్చేదాకా భక్తులను దారుణంగా దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంద్రకీలాద్రి ఇప్పుడు దోపిడీకి కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ వ్యాపారులు, సిబ్బంది భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారట. ఈ దోపిడీకి అధికారులు కూడా సహకారం అందిస్తున్నారని చెబుతున్నారు. అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లడానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. కానీ, అవి సరిపడా లేవు. ఎప్పుడో ఒకటి వస్తున్నాయి. దీంతో, ఎండాకాలం కావడంతో.. భక్తులు వేడికి తాళలేక.. అనివార్యంగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉచిత బస్సులే కాకుండా.. వారధి కింద నుంచి కొండపైకి వెళ్లడానికి సెవెన్ సీటర్ ఆటోలు నడుస్తున్నాయి. భక్తులను ఈ ప్రైవేటు వాహనాల్లో ఎక్కించడానికి అక్కడ విధులు నిర్వహించే ఆలయ సిబ్బందే సహకరిస్తున్నారని చెబుతున్నారు. అటు ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఉండే సిబ్బంది కూడా.. భక్తుల సొంత వాహనాలకు ఆంక్షలు పెడుతున్నారని అంటున్నారు. కానీ, కొండపైకి వచ్చే ప్రైవేటు ప్యాసింజర్స్ వాహనాలను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారట. ఈ ప్రైవేటు వాహనాల్లో ఒక్కో భక్తుడి నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. ఏదోలా కొండపైకి వచ్చిన భక్తులు.. అక్కడ కూడా దోపిడీకి గురవుతున్నారు. సాధారణంగా రూ.20 ఉండే వాటర్ బాటిల్‌ను రూ.30కి అమ్ముతున్నారట. ఇందేటని ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే కొనుక్కో.. లేదంటే లేదు.. అని వ్యాపారులు గద్దిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఇక, కూల్ డ్రింక్స్ ధరల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. కొండపై ఆలయం ముందు ఫొటోలు తీసేవారు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా.. అమ్మవారి కొండపైకి ఎక్కడానికి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులను లిఫ్ట్‌లో పైకి తీసుకెళ్లాలి. కానీ.. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారట. డబ్బులు వసూలు చేసి.. లిఫ్ట్‌లో ఎక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు కొండపై నుంచి కిందకు దిగడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో బస్సులు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు వాహన యజమానులు అక్కడికి వచ్చి.. భక్తులకు మాయమాటలు చెప్పి.. వాహనాల్లో ఎక్కిస్తున్నారు. ఇలా ప్రతీచోటా.. భక్తులు దోపిడీకి గురవుతున్నారన్న వాదనలున్నాయి. ఇక కొండపైకి ఎక్కాక.. పరిస్థితి గతంలో మాదిరిగా లేదు. ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. దర్శనం తర్వాత భక్తులు బయటకు రావడానికి కూడా సరైన మార్గం లేదు. లడ్డూ ప్రసాదం ఎక్కడ విక్రయిస్తారో తెలియక చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. సిబ్బందిని అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పిస్తారు. ఈ ప్లేస్‌లో అయితే, మామూలు దోపిడీ లేదట. ఒక్కో భక్తుడి దగ్గర ఆలయ అధికారులు రూ.40 తీసుకొని టోకెన్ ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ, తీరా అక్కడికి వెళ్లాక రూ.100 ఇస్తేనే తలనీలాలు తీస్తున్నారట. ఇవ్వకపోతే.. బూతులు తిడుతున్నారని భక్తులు బాధ పడుతున్నారు. ఆగమాగం తలనీలాలు తీస్తున్నారని, పుట్టు వెంట్రుకలు అయితే.. ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
- Advertisement with us -