ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాలమూరు రైతు పండుగ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంతోనే ఈ రోజు పాలమూరులో పండుగ వాతావరణ నెలకొంది. ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే బీఆర్ ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
పదేళ్లలో రైతులను పట్టించుకోని బీఆర్ ఎస్ నేతలు ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, భీమా, జూరాల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్త చేసింది. పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరును ఎండపెట్టిన బీఆర్ ఎస్ పాలనతో విసిగిన ప్రజలు చీదరించుకున్నారని ఆరోపించారు. పదేళ్లు మాటలు చెప్పిన కెసిఆర్ హామీలు గాలికి వదిలేశారు. ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోనే 18 వేల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని భట్టి వెల్లడించారు. 15 రోజుల్లోనే హామీల అమలు అనేది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదని స్పష్టం చేశారు.
కెసిఆర్ ప్రభుత్వం 8 వేల కోట్ల అప్పులు చేసిపోయినా మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి ధర్నాల పేరుతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలుచేస్తామని తేల్చి చెప్పారు. 18 వేల కోట్లు మాఫీ చేసిన తర్వాత కొంత మంది మిగిలారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అప్ డేట్ కాక ఆగితే బీఆర్ ఎస్ నేతలు ఉద్యమం చేస్తామని ప్రగల్భాలు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలివారి లెక్కలు తీసి మూడు నెలల్లో వివరాలు సేకరించి 3,13,897 మంది రైతులకు రూ.2747.67 కోట్ల చెక్ ను అంచేశామని ఉపముఖ్యమంత్రి వివరించారు.
మీరు(బీఆర్ ఎస్ నేతలు) ఏడుస్తూనే ఉండండి, మేము ప్రజల కోసం పండుగలు చేస్తూనే ఉంటామని ఉపముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటామని.. బీఆర్ ఎస్ మాదిరిగా గాలికి వదిలేయమని అన్నారు.
కేవలం రుణమాఫీ కాకుండా.. వరద వల్ల పంట నష్టపోయిన వారికి ఎకరానికి పది వేల చొప్పున 100 కోట్లు విడుదల చేశాం. రైతు భీమా కోసం లెక్కలు తీసి మరి ఆదుకున్నామని… ప్రభుత్వం తరపున 50 లక్షల మంది రైతుల కోసం 1,433 కోట్ల ప్రీమియం చెల్లించి రైతాంగానికి అండగా నిలిచాం. పండిన పంటకు భీమా కోసం 2500 కోట్లు రైతుల పక్షాన చెల్లించేందుకు ముందుకు వచ్చామన్నారు.
వ్యవసాయంలో ఆధునీకరణ కోసం 73 వేల కోట్ల నిధులను రాష్ట్ర బడ్జెట్ లో కేటాయిస్తే ప్రభుత్వంపై బీఆర్ ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ ఎస్ అప్పు చేస్తే రూపాయి రూపాయి జమ చేసి ప్రజల కోసం పనిచేస్తున్నామని, ఇది దొరల ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాబోయే నాలుగేళ్లు కూడా ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పండుగలు నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.