కేంద్రం చేపట్టబోయే పార్లమెంటు నియోజక వర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డిమాండ్ చేశారు. చెన్నై వేదికగా జరిగిన.. దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన స్టాలిన్ స్వాగతోపన్యాసం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల ముఖ్య నాయకులకు సాదరంగా స్వాగతం పలికి.. సత్కరించారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగానే సమావేశం ఉద్దేశ్యం, లక్ష్యాల గురించి దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న నష్టం, ఆ నష్ట నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి మాట్లాడారు.
అందరం కలిసి ఐక్యంగా తమ గళాన్ని బలంగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు స్టాలిన్. నియోజక వర్గాల పునర్విభజన న్యాయ బద్ధంగా జరిగే దాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలన్నీ గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధుల సంఖ్య తగ్గితే.. మన వాణి వినిపించే బలం తగ్గిపోతుందని, మన డిమాండ్లు నెరవేర్చుకోలేమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఏ చర్యను కూడా తాము వ్యతిరేకించడం లేదన్న స్టాలిన్.. ఇది న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేయకూడదని అభిప్రాయ పడ్డారు. ఈ నిరసన నియోజక వర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కాదన్నారు. న్యాయబద్ధంగా పునర్విభజన జరగాలన్నదే తమ అభిమతమని స్టాలిన్ పేర్కొన్నారు.