అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తెలిసిపోయింది. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలు వెల్లడైనప్పటినుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే సస్పెన్స్ ఇన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. అయితే, ఈ ఉత్కంఠకు తెర పడేలా.. కొద్దిసేపటి క్రితం సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంది. షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. గురువారం రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఢిల్లీ సీఎం ఎంపిక కోసం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జాతీయ కార్యదర్శి ఓపీ దన్కర్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఈ ఇద్దరు పరిశీలకులు శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని సభ్యుల ముందుంచారు. చివరిగా ఏకగ్రీవంగా రేఖా గుప్తా పేరును ఢిల్లీ సీఎంగా ఎన్నుకున్నారు.
బీజేపీ అనూహ్య నిర్ణయం :
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై 12 రోజులు పూర్తయినా.. సీఎం ఎవరనేదానిపై క్లారిటీ రాక పోవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. బీజేపీ శాసనసభపక్ష సమావేశం జరగడానికి ముందు వరకు కూడా పది పేర్లు వినిపించాయి. ముందుగానే బీజేపీ అధిష్టానం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ ఆ పేరు బయటకు రాకుండా చివరి దాకా గోప్యత పాటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక కోసం నియమించిన పరిశీలకులు ఎమ్మెల్యేల సమావేశంలో అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి ఎమ్మెల్యేలంతా ఓకే చెప్పడంతో ఎలాంటి వివాదం లేకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక పూర్తయ్యింది. వాస్తవానికి ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, పవన్ శర్మ, ఆశిష్ సూద్, శిఖా రాయ్, పర్వేష్ సాహిబ్ సింగ్, రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్, కైలాష్ గంగ్వాల్, అనిల్ గోయల్, రాజ్ కుమార్ భాటియా పేర్లు ముఖ్యమంత్రి పదవికోసం వినిపించాయి. ఈ జాబితాలో రేఖా గుప్తా పేరు అసలు వినిపించలేదు. కానీ, బీజేపీ హై కమాండ్ మాత్రం అనూహ్యంగా రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంపిక చేసింది.