మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పూర్తిగా అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇజ్రాయెల్ తమ బలగాలను వెనక్కి తీసుకోలేదు కాబట్టి బందీల విడుదలను ఆలస్యం చేస్తామని ప్రకటించింది హమాస్. అయితే శనివారంలోపు బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇవేవీ తాము పట్టించుకోమని చెబుతోంది హమాస్.
శనివారంలోపు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసే ప్రసక్తే లేదని హమాస్ ప్రతినిధి తేల్చిచెప్పారు. తాము ఒకేసారి బందీలను విడుదల చేయమని.. గతంలో చెప్పినట్టుగా విడతల వారిగా బందీలను విడుదల చేస్తామని తేల్చి చెబుతోంది హమాస్. మరి దీనిపై అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
అయితే ఈ స్టేట్‌మెంట్‌పై ఇన్‌డైరెక్ట్‌గా ఇజ్రాయెల్ రియాక్ట్ అయ్యింది. బందీలు విడుదల కాకపోతే కొత్త యుద్ధం మొదలవుతుందని ప్రకటించింది. బందీలందరిని విడిచిపెట్టేవరకు యుద్ధం ఆగదని.. ఈ విషయంలో తాము ట్రంప్ ప్లాన్‌ను అమలు చేస్తామని ప్రకటించింది.
నిజానికి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 21 మంది బందీలను హమాస్ రిలీజ్ చేసింది. ఇక 730 మందిని ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత బందీల విడుదలను ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటించడంతో సీన్ మారిపోయింది.
ట్రంప్ ప్రకటనను ఇప్పుడు తమ ఆయుధంగా మలుచుకునేందుకు సిద్ధమైంది హమాస్. ప్రపంచవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీకి పిలుపునిచ్చింది. గాజాను పునర్ నిర్మిస్తాం.. దాని కోసం ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటాం అనే మాటలకు వ్యతిరేకంగా ఏకం కావాలని పిలుపునిస్తోంది హమాస్.
ప్రస్తుత పరిణామాలన్ని చూస్తుంటే త్వరలోనే మళ్లీ మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తోంది.