26.2 C
Hyderabad
Sunday, October 19, 2025

Live Video

spot_img

మాజీ ఐఏఎస్‌ నుంచి మూడున్నర కోట్లు కొట్టేసిన సైబర్‌ క్రిమినల్స్‌

సైబర్ మోసాలపై ఎంతగా చైతన్యం కలిగిస్తున్నా, ఏ స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ప్రజల్లో అప్రమత్తత చాలా మందిలో కనిపించడం లేదు. నిత్యం కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్లు ఇప్పుడు కేవలం అమాయకులు, నిరక్షరాస్యులనే కాదు.. ఉన్నత విద్యావంతులు, ప్రముఖుల్నీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాదులో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఓ మాజీ ఐఏఎస్ అధికారి సైబర్ నేరగాడి మాయలో పడి ఏకంగా రూ.3.37 కోట్లు నష్ట పోయారు.

72 ఏళ్ల వయసున్న ఈ మాజీ అధికారి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేశారు. ప్రస్తుతం సోమాజీగూడలో నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెల్‌ఫోన్‌కు ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ పేరిట ఓ లింక్ వచ్చింది. ఆయనకు షేర్ మార్కెట్ మీద ఆసక్తి ఉండటంతో ఆ లింక్ ఓపెన్ చేసి, అక్కడ ఉన్న సమాచారాన్ని ఫాలో అయ్యారు. దీంతో ఒక వ్యక్తి, తాను ప్రముఖ కంపెనీకి చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ని అని పరిచయం చేసుకున్నాడు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ట్రేడింగ్ చేసి, మ్యూచువల్ ఫండ్స్, ఐపీవోల్లో పెట్టుబడులు పెడితే 120% నుంచి 160% వరకు లాభాలు వస్తాయని నమ్మబలికాడు. ఈ మాటలతో ఆకర్షితుడైన ఆ మాజీ అధికారి, రోజు మూడుసార్లు వచ్చే వాట్సప్ వీడియో కాల్స్‌లో స్టాక్ మార్కెట్ విషయాల్లో సలహాలు తీసుకుంటూ, మాయగాడిని నమ్మడం మొదలుపెట్టారు. నమ్మకాన్ని పెంపొందించేందుకు మొదట్లో అతను రూ.5,000 నుంచి రూ.10,000 వరకూ బోనస్‌లుగా పంపిస్తూ మరింత నమ్మకం కలిగించాడు.

ఆ తరువాత అసలు దందాకు తెరలేపాడు. మార్చి 30 నుంచి మే 13 వరకూ ఏకంగా రూ.3.37 కోట్లను విడతలవారీగా పలుచోట్ల ఖాతాల్లో జమ చేయించాడు. ఆ మొత్తం పెట్టుబడికి వర్చువల్ అకౌంట్‌లో రూ.22.35 కోట్లు లాభమొచ్చిందని చూపించాడు. లాభాలు వచ్చాయని భావించిన మాజీ అధికారి వాటిని విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో, తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com