1. చేసింది చెప్పుకోలేకపోతున్నామంటున్నా కాంగ్రెస్ నాయకులు.
2. విపక్షాల ఆరోపణలకు కౌంటర్ కోసం ప్రయత్నాలు.
3. రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చిన వెంటనే కీలక సమావేశం.
4. కౌంటర్ ఎటాక్ కోసం సీనియర్ మంత్రులకు బాధ్యతలు.
5. రెగ్యులర్ గా మీడియా సమావేశాలు జిల్లా స్థాయిలో సభలు..
రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం.. విపక్షాలు విమర్శలు చేయడం దానికి దీటుగా అధికార పక్షం సమాధానాలు ఇవ్వడం రెగ్యులర్గా జరుగుతుంటుంది… తెలంగాణ రాజకీయాల విషయానికొస్తే ప్రస్తుతం దీనిపైన అధికార పార్టీలో భిన్నమైన చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మంచి మెజారిటీతో గ్రామీణ ప్రాంత ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏడాది పూర్తయిన తర్వాత కొన్ని వింత సమస్యలు ఎదుర్కొంటోంది.
ప్రభుత్వ విధానాలపై కమలం, గులాబీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తోంటే హస్తం నేతలు మౌనవ్రతం పాటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాతో పాటు ప్రజాబాహుల్యంలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న నాయకులు అధికంగా ఉన్న సమయంలో దీనికి కౌంటర్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది… అయితే కౌంటర్ చేయలేకపోతున్నాం అన్న అభిప్రాయం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం గ్రామసభల్లో జరుగుతున్న పరిణామం చూస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది… రేషన్ కార్డులు ఇవ్వడం లేదని బియ్యం పంపిణీ చేయడం లేదని ఇల్లు ఇవ్వడం లేదని విపక్షాలు ఆరోపణల పైన ఆరోపణలు చేస్తున్నాయి.. గ్రామ సభలతో పాటు సోషల్ మీడియా ఇతర మీడియా మార్గాల ద్వారా ఈ ప్రచారం జోరుగానే సాగుతోంది.. ఈ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళుతోంది అన్న ఆందోళన కూడా హస్తం నేతల్లో వ్యక్తం అవుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో చేసింది చెప్పుకునే పరిస్థితి కనిపించడం లేదని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… కొందరు మంత్రులు కూడా ఆశించిన స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం లేదన్న వాదన కూడా ఉంది… ఈ పరిస్థితిని గమనించే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరచుగా మంత్రులతో మాట్లాడుతూ… అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని మార్గదర్శకత్వం చేస్తున్నారు. గురువారం మూడో రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో గ్రామసభల్లో గందరగోళం నెలకొంది..
ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చిన వెంటనే కీలకమైన భేటీ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.. ఇకనుంచి గట్టి కౌంటర్ ఇవ్వాలని అందుకు కొందరు మంత్రులను ఎంపిక చేసి రెగ్యులర్గా మీడియా సమావేశాలు నిర్వహించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. సీనియర్ మంత్రుల ద్వారా పూర్తి వివరాలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది? ప్రస్తుత ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఎక్కడ ఎంత ఖర్చు చేశారు లాంటి కీలకమైన అంశాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అదేవిధంగా చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు సీనియర్ నాయకులు కూడా చాలా సందర్భాల్లో మౌనంగా ఉండడం పార్టీలో చర్చకు దారితీస్తోంది… క్యాబినెట్ విస్తరణ ఆలస్యం కావడం వల్ల కొందరు మౌనంగా ఉంటున్నారు అనే వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది.. మొత్తానికి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో కౌంటర్లు గట్టిగా ఇచ్చేందుకు పార్టీ పరంగా… ప్రభుత్వ పరంగా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది.