- తెలంగాణలో చేసిన కులగణన బీసీలే ఒప్పుకోలేదు
- కులగణన చేయాలనే కేంద్ర నిర్ణయం చారిత్రాత్మకం
బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడిన డీకేఅరుణ జనగణన విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఎంపీ అన్నారు. కాంగ్రెస్ ను చూసి మేము కులగణన చేస్తున్నమన్న ప్రచారం పచ్చి అబద్దమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన ఓ తప్పుల తడక అని సగం మంది ప్రజలు అసలు కులగణనలో పాల్గనలేదని అరుణ తెలిపారు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తుంది తప్పితే కులగణన విషయంలో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 1931వ సంవత్సరంలో జరిగింది మాత్రమే కులగణన అని ఆమె స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నది బీజేపీనే అన్నారు. కుల గణనకు మేమే ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ చెప్పడం సిగ్గు చేటని 60 ఏళ్ళుగా ఆధికారంలో ఉన్న మీరు ఇంతకాలం ఎందుకు కుల గణన చేయలేదని డీకే అరుణ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణనకి ఉండే క్రెడిబులిటీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కుల గణనకు ఉండదని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణనను బీసీలే వ్యతిరేకించారంటే వాళ్ళు చేసిన కుల గణనకు క్రెడిబులిటీ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చని బీజేపీ ఎంపీ డీకేఅరుణ వ్యాఖ్యానించారు.