పహెల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు చైనాను శరణు కోరుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ దాడులు చేస్తే.. యుద్ధం ప్రారంభించినా.. ఆదుకునే సత్తా ఉన్నది చైనా మాత్రమే అని ఆ దేశ ఆలోచన. అందుకే ఇప్పుడు చైనా పంతన చేరుతోంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్థాన్, ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని వెల్లడించాడు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించినట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్ డిమాండ్ చేస్తున్న నిష్పాక్షికమైన దర్యాప్తు డిమాండ్ సరైందే అంటోంది చైనా. అంతేకాదు పాకిస్థాన్ మాకు మంచి మిత్రదేశమని.. ఆ దేశ ఆందోళనలను మేము పరిశీలిస్తున్నామని.. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చైనా ప్రకటించింది. ఇన్ని విషయాలు చెబుతూనే ఇరు దేశాలు సంయమనం పాటించాలని.. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటోంది చైనా.
చైనాతో మాట్లాడినప్పుడు కూడా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది పాకిస్థాన్. తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ కుట్ర చేస్తోందని.. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చింది.
ఇక చైనా ఇచ్చిన స్టేట్‌మెంట్ కూడా పాక్‌కు కంటితుడుపు మాత్రమే అని చెప్పాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పాక్‌కు మద్దతిచ్చేది కేవలం రెండు దేశాలు మాత్రమే. ఒక తుర్కియా కాగా.. మరొకటి చైనా. తుర్కియాను భారత్ అస్సలు ఖాతరు చేయదు.. ఇక చైనా అంటేనైనా.. కాస్తా వెనకడుగు వేస్తారన్న ఆశ పాకిస్థాన్‌ది. కానీ ఒకేసారి రెండు దేశాలతో యుద్ధం వస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచనే చాలా ఏళ్ల క్రితమే వచ్చింది భారత్‌కు. అప్పటి నుంచి దీనికి తగ్గట్టుగానే ఇండియన్ ఆర్మీ ఏర్పాట్లు చేసుకుంటుందనే చెప్పాలి.