అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తుదిశ్వాస విడిచారు. లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆచార్య సత్యేంద్ర దాస్ వయసు 85 సంవత్సరాలు. ఈనెల 2వ తేదీన ఆయన తీవ్ర ఆనారోగ్యం బారి పడటంతో తొలుత అయోధ్యలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం.. వైద్యుల సూచనతో మరుసటిరోజు.. అంటే ఫిబ్రవరి 3వ తేదీన లఖ్‌నవూ లోని ఎస్‌జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు.సత్యేంద్రదాస్ మధుమేహం, బీపీతో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరారని, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన పరిస్థితి విషమించి.. ఇవాళ తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 4వ తేదీన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి వెళ్లారు. ఆచార్య సత్యేంద్ర దాస్ క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆచార్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఆచార్య సత్యేంద్ర దాస్ అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి. ఆయన బాల్యం నుంచి అయోధ్యలోనే నివసించారు. రాంలాలా ఆలయంతో ఆచార్య సత్యేంద్ర దాస్‌కు దాదాపు 33 సంవత్సరాల అనుబంధం ఉంది. బాబ్రీ కూల్చివేతకు ముందు నుండే ఆయన ఈ ఆలయంలో పూజలు చేస్తున్నారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులోనే ఆయన నిర్వాణి అఖాడాలో చేరారు. అప్పట్నుంచి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. గతేడాది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత అక్కడ రామ మందిరం ప్రధాన పూజారిగా ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.