26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలి – పార్టీ నేతలకు వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం

  • వాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాలి
  • రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ సీట్లు వద్దంటూ లేఖ
  • కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలు
  • ఇవి పేద విద్యార్థులకు తీరని నష్టం కలగజేస్తున్నాయి
  • ఈ అం«శాన్ని కూడా ఫీజు పోరులో భాగం చేయాలి
  • పేదల పట్ల చంద్రబాబు కక్షను బట్టబయలు చేయాలి

రెండు వారాల లండన్‌ పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్న వైయస్‌ జగన్, మంగళవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటనలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్‌ అమలు విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన, ఎన్నికల హామీల అమలుపై ఆయన వైఖరిని మరోసారి తేటతెల్లం చేశాయని ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ అన్నారు. సూపర్‌సిక్స్‌ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా.. అందుకే ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలా అవి ఇప్పుడు ఆచరణకు సాధ్యం కాదంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఒకవైపు హామీలన్నీ తుంగలో తొక్కడం, మరోవైపు విద్యుత్‌ ఛార్జీల మోత.. వంటివన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు.. కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీయడం.. వంటి అంశాలను కూడా ప్రజల్లో ఎండగట్టాలని ఆయన నిర్దేశించారు. చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు. ఫీజు పోరుపై ఈసీ అనుమతి పెండింగ్‌లో ఉండడంతో వాయిదా వేసిన అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ, పేద విద్యార్థులను దారుణంగా దెబ్బ తీస్తున్నారని వైయస్‌ జగన్‌ అన్నారు. కేంద్రం వచ్చే అయిదేళ్లలో 75వేల మెడికల్‌ సీట్లు అదనంగా పెంచబోతోందని.. కానీ, చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్‌ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణమన్నారు. పేద విద్యార్థుల పక్షాన ఈ అంశాన్ని ఫీజు పోరులో భాగం చేయాలని వైయస్‌ జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో మెడికల్‌ సీట్ల కుదింపు, కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని కూడా ఫీజు పోరులో భాగం చేసి, పేద విద్యార్థుల పట్ల చంద్రబాబుకు ఉన్న కక్షను ప్రజల్లో బట్టబయలు చేయాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోత, నిల్చిపోయిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. 9 నెలల కూటమి పాలన, పేదల వ్యతిరేక పాలనలా జరిగిందని.. దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ.. క్షేత్రస్థాయి అంశాలను సమావేశంలో నాయకులు పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల దారుణాలపైనా సమావేశంలో చర్చించారు. ఇలాంటి అరాచకాలు ఎక్కడా చూడలేదని, మెజారిటీ లేని, అసలు ఒక్కోచోట సభ్యులే లేని వారు కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారని సమావేశంలో చర్చించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, విడదల రజని, పార్టీ సీనియర్‌ నేతలు కోన రఘుపతి, ముదునూరు ప్రసాదరాజు, ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, కోరుముట్ల శ్రీనివాసులు, అదీప్‌రాజ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com