హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలోని భూముల వివాదం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భూముల వేలం పై ప్రతిపక్ష పార్టీలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. భూములను అమ్మితే గానీ ప్రభుత్వం నడవదా? అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూములను చదును చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఈ అంశంపై పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. హైడ్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర భూముల్లో చెట్ల నరికివేత, వృక్ష సంపద నష్టం, వన్యప్రాణుల నివాసాలపై ప్రభావం వంటి అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ లేఖలో భారత అటవీ చట్టం, వన్యప్రాణుల రక్షణ చట్టం, వన్ సంరక్షణ చట్టం నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
పార్లమెంట్ సభ్యులు, ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు వెంటనే నివేదిక సమర్పించాలని, కోర్టు ఆదేశాలను అతిక్రమించకుండా ఉండాలని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పచ్చదనం కాపాడాలని సూచించింది.
ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన, పోలీసుల మోహరింపుతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఇంకా ప్రశాంతంగా మారలేదు.