31.2 C
Hyderabad
Saturday, April 4, 2026

Live Video

spot_img

వివాదాల ట్వీట్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌?

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ కోటరీలో చక్రం తిప్పిన ఐఏఎస్‌ అధకారి స్మితా సభర్వాల్.. ఆ తర్వాత లూప్ లైన్‌లోకి వెళ్లినప్పటికీ ఆమె ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న స్మితా సభర్వాల్‌కి ఇటీవల తిరిగి రేవంత్ సర్కార్ ఫోకల్ పోస్టు కేటాయించింది. ఇచ్చిన పనిపై కంటే ఎక్స్‌ట్రా కర్రిక్యులర్ యాక్టివిటీస్‌తో.. ఐఏఎస్‌ స్మిత కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి.

తెలంగాణలోని ఐఏఎస్ లలో అందరికంటే ఎక్కువగా స్మితా సభర్వాల్‌ సామాజిక మాధ్యమాలను వాడుతుంటారు. అంతేకాదు.. తనని తాను చాలా పెద్ద ఇంటలెక్చువల్‌గా, ఎంపవర్డ్ ఉమెన్‌గా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల స్మిత ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఓ మెస్సేజ్‌కు రియాక్ట్‌ అయ్యారు. ఈ పరిణామం పోలీసుల నోటీసులకు దారి తీసింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆమె షేర్‌ చేసిన ఎక్స్ మెసేజ్‌కు సంబంధించి… గచ్చిబౌలి పోలీసులు టూరిజం సెక్రెటరీగా ఉన్న స్మితా సభర్వాల్‌కి నోటీసులు ఇచ్చారు. ఫేక్‌, ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారన్నది స్మితా సభర్వాల్‌పై నమోదైన అభియోగం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో స్మిత సభర్వాత్‌ కీలకంగా ఉన్నారు. అది ప్రతిష్టాత్మకమైన, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌ కావడం, పైగా టూరిజం సెక్రెటరీగా ఉండి బయట ఫోకస్డ్‌ పొజిషన్‌ కావడంతో.. ఆమె పోస్ట్‌ను రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో ఫేక్ వీడియోలు, ఫొటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఆమె మీద కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

గతంలో కూడా ఇలాగే చాలాసార్లు తన ట్వీట్స్‌తో వివాదాస్పదం అయ్యారు స్మితా సభర్వాల్‌. ఐఏఎస్‌గా ఎంపిక‌య్యే వారికి ఎలాంటి వైకల్యం ఉండకూడదని, కాళ్లు చేతులు స‌క్రమంగా ఉండాలంటూ.. స్మిత చేసిన ట్వీట్‌ జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపింది. సాటి ఐఏఎస్‌లు కూడా ఆమె వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. చివరికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి దాకా వెళ్లింది వ్యవహారం. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్మితా సభర్వాల్‌ తన వాహనం మెయింటెనెన్స్‌ కోసం లక్షల రూపాయలు యూనివర్సిటీ నిధులను చెక్కుల రూపంలో తీసుకోవడాన్ని ఆడిట్‌ ‌అధికారులు తప్పు పట్టారు. తొమ్మిదేళ్ళలో దాదాపు 61లక్షల రూపాయలను స్మితా సభర్వాల్‌ వాహనానికి చెల్లించడం వివాదాస్పదమైంది. ఆ వ్యవహారం కూడా నోటీసుల దాకా వెళ్ళింది. కానీ, ప్రభుత్వ ఉన్నతాధికారిగా పని చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం పైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వంలో అధికారిగా కొనసాగడం ఇష్టం లేకపోతే.. ఆమె పోస్టు నుంచి తప్పుకోవాలి కానీ, ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయినా.. తనని తాను చాలా తెలివైన, ఇంటలెక్చువల్ పర్సన్‌గా సెల్ఫ్ ప్రమోట్ చేసుకునే స్మిత సభర్వాల్ ఒక ఏఐ ఫేక్ ఫోటో ని ఎలా గుర్తించలేకపోయారు? అంత గుడ్డిగా ఫోటోని సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేశారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.చిన్న చిన్న ఉద్యోగులు తెలిసీ తెలియక తప్పులు చేస్తే.. సస్పెన్షన్లు, డిస్మిస్ చేసే ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తే ఎలాగన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు పెట్టడం సరైన పద్ధతి కాదంటున్నాయి సచివాలయ వర్గాలు. కేసిఆర్ ప్రభుత్వంలో అంతా తానై నడిపించిన స్మితా సభర్వాల్‌.. ప్రస్తుతం ఉనికి చాటు కునేందుకే ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా.. వివాదాలు స్మితకు కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవని నెత్తినేసుకోవడం ఆమెకు అలవాటే అంటున్నారు. సీనియర్‌ ఐఎఎస్‌లు సాధారణంగా.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తమదైన శైలిలో తీసుకువెళ్ళడం, అభివృద్ధిలో తమ ముద్ర కనిపించేలా సంస్కరణలు తీసుకురావడం వంటివి చేస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా స్మిత సభర్వాల్‌ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, సాఫీగా సాగుతున్న పనిలో కల్పించుకుని వివాదాస్పదం చేయడం అలవాటైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో… కంచ గచ్చిబౌలి భూములపై స్మిత పెట్టిన మెసేజ్‌కు రియాక్షన్‌గా పోలీసులు నోటీసుతోనే సరిపెడతారా? లేక అంతకు మించి ముందుకు వెళతారా అన్నది చూడాలి. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్మిత సభర్వాల్.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఆఫీసర్‌ మాదిరిగా వ్యవహరించారు. అంతేకాదు.. ఆమె ఐఏఎస్ అధికారిగా కంటే బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలి మాదిరిగానే వ్యవహారాలు నడిపారన్న విమర్శలున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక వ్యవహారంలో దూరి, తన ఉనికిని చాటుకోవడం కోసం స్మితా సభర్వాల్ ఇప్పుడు చేస్తున్న పనులు చూసి సీనియర్లు నవ్వుకుంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com