తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోగా లేదా జూన్ తొలి వారంలో పూర్తి కావొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ అంశాన్ని తాజాగా ప్రస్తావించడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తాను కేవలం సూచనలు మాత్రమే ఇస్తానని, తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దే అని స్పష్టం చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఈసారి జరిగే అవకాశాలు పటిష్టంగా కనిపిస్తున్నాయి.
2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. ఇప్పటికీ ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఆశావాహులు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లభించిన అధికారం, అనంతరం వచ్చిన లోక్‌సభ ఎన్నికల కోడ్ వల్ల విస్తరణ వాయిదా పడింది. ఎన్నికల అనంతరం పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం మళ్లీ విస్తరణ ప్రక్రియను పునరుద్దరించింది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు మంత్రులుగా ఎవరు అవకాశం పొందబోతున్నారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో, విస్తరణలో ఆ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం కల్పించేందుకు సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఒకే కుటుంబానికి రెండవ అవకాశమిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి. వివేక్, ప్రేమ్ సాగర్ రావు పేర్లు కూడా రేసులో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు గెలవకపోయినా, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత దానం నాగేందర్ మంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా నిలుస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఎస్టీ వర్గానికి చెందిన ఇద్దరి పేర్లు కూడా పార్టీలో చర్చకు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని పరిగి ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా కేబినెట్‌లో చోటు కోసం తమ దారిలో తాము వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు లేకపోవడంతో.. ఈసారి విస్తరణలో వారికోసం ఓ స్థానం ఖాయం అనుకుంటున్నారు.
ఒకవేళ ఈ విడతలో అన్ని ఖాళీలను భర్తీ చేయకుండా, నాలుగు స్థానాలకు మాత్రమే మంత్రులను నియమించి, మిగిలిన రెండింటిని తర్వాత భర్తీ చేసే అవకాశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్ ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించింది. ఈ నెలాఖరులోపు ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.