బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. మూడు కేసుల్లో కౌశిక్ రెడ్డికి కరీంనగర్ జిల్లా రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. రెండు కేసుల్లో రూ.25వేల చొప్పున రూ.50వేల పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. అలాగే అన్ని కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్టును కొట్టివేశారు.
రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి నిబంధనలు అడ్డువస్తున్నాయి అర్థం చేసుకోగలరని విన్నవించారు. అంతకు ముందు ఉదయం కోర్టుకు తీసుకువెళుతుండగా కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇటువంటి అక్రమ అరెస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం కరీంనగర్ త్రీ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చేందుకు తీసుకెళ్తుండగా పోలీస్ వాహనం నుంచి జై తెలంగాణ అంటూ నినాదం చేశారు. అమ్ముడు పోయిన ఒక ఎమ్మెల్యేను నిలదీసినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని, పండగ పూట రాత్రంతా పోలీసు స్టేషన్ లోనే ఉంచారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో కరీంనగర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానల్ ముందు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. వెంటనే కరీంనగర్‌కు తరలించారు. రాత్రంతా ఆయన్ను త్రీటౌన్ పీఎస్‌లోనే ఉంచారు. మంగళవారం ఉదయం స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి.. భారీ బందోబస్తు నడుమ ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.