తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ జరిగినన్ని రోజులు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పీకర్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పట్ల అభ్యంతరకర రీతిలో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీఆర్‌ఎస్ సభ్యులు మాత్రం జగదీష్ రెడ్డికి అండగా నిలిచారు. జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను సమర్థించారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో, సభను సభాపతి వాయిదా వేశారు.
తిరిగి అసెంబ్లీ మొదలైన తర్వాత బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసనలు తెలియజేశారు. అనంతరం సభ నుంచి బయటికి వెళ్లిపోయారు.
అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడిన జగదీష్ రెడ్డి.. ఈ సభ అందరిదని.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్ కూర్చున్నారని.. ఈ సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు.
ఇక, స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సభలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జగదీష్ రెడ్డి వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డిని సభ నుంచి బడ్జెట్ సెషన్స్ వరకూ సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. అలాగే, జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించిన ఫుటేజీనీ ఎథిక్స్ కమిటీకి పంపించాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని ప్రతిపాదించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వాలను రద్దు చేశారని ఉత్తమ్ గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనను మంత్రి సీతక్క సమర్థించారు. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలన్నారు. అయితే, అంత పెద్ద శిక్ష వద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వారించారు. ఈ ఇష్యూను ఎథిక్స్ కమిటీకి పంపుదామని ప్రతిపాదించారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని సభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించగా.. స్పీకర్ ఆమోదించారు. జగదీశ్‌రెడ్డి వెంటనే సభ నుంచి వెళ్లి పోవాలని స్పీకర్ ఆదేశించారు.
జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను ప్రతిపాదించిన సమయంలో శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సభలో జగదీష్ రెడ్డి వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు.
ఏకవచనంతో స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడటం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం ఏ సభ్యుడు కూడా బయట లేదా లోపల స్పీకర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తెలియజేవారు. స్పీకర్ చర్యలు, అధికారాలను ప్రశ్నించే అధికారం ఏ సభ్యుడికి లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీని సజావుగా నడవనీయోద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభకు వచ్చినట్లుగా అనిపిస్తుందన్నారు. స్పీకర్‌ను దూషించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మాట్లాడిన ప్రతి పదాన్ని జగదీష్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సభ్యులందరి కోరిక మేరకు జగదీష్ రెడ్డిని ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు.
జగదీష్ రెడ్డిని బడ్జెట్ సెషన్స్ వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించిన తర్వాత.. కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చొన్న జగదీశ్‌రెడ్డి వద్దకు చీఫ్ మార్షల్ వచ్చి అసెంబ్లీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే, తనను సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని, ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మరోసారి గందరగోళం చెలరేగింది. కొద్దిసేపటి అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.