తెలంగాణలో పదేళ్ల పాటు తిరుగులేని స్థాయిలో పరిపాలన సాగించిన బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు చతికిలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్న కల నెరవేరకపోవడంతో అప్పటినుంచీ నిస్తేజంగా ఉంటోంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అడ్రస్సే గల్లంతయ్యింది. కేసీఆర్ అయితే ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావడం లేదు. కేటీఆర్, హరీష్‌రావు మాత్రమే అడపా దడపా పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. అసెంబ్లీలో కూడా వాళ్లిద్దరే ప్రధాన దిక్కయ్యారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా.. ఆ ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉంటోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సత్తా చాటాలన్న లక్ష్యంతో వాటిమీదే ప్రధానంగా ఫోకస్ పెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, త్వరలోనే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి.. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ పోటీలో ఉంటుందా? లేదా? అన్నది సందేహంగా మారింది.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈనెల 25వ తేదీన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీ బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీలోపు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే రోజు.. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది ప్రకటిస్తామన్నారు. అంతేకాదు.. 17వ తేదీన జరిగే సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్ హాజరవుతారని, ఆ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొంటారని తెలుస్తోంది.
ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్‌ఎస్ ప్రాభవం చూస్తే.. మరీ దిగజారి పోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీచినా.. హైదరాబాద్‌లో మాత్రం బీఆర్ఎస్ తన హవా చూపించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోగా.. మొత్తం సీట్లు గులాబీ పార్టీనే కైవసం చేసుకుంది. అయితే.. తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.. గులాబీ కండువా తీసేసి హస్తంతో దోస్తీ కట్టారు. వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో, హైదరాబాద్‌లో కూడా బీఆర్ఎస్ బలం తగ్గినట్టయింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పోటీ చేస్తుందా, లేదా అన్న విషయంలో ఆ పార్టీ నేతలు కూడా ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.