భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈ రోజు(బుధవారం) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టీస్ గవాయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్, పీయూష్ గోష్, కింజారపు రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తొలి బుద్దిస్టు, రెండో దళిత వ్యక్తిగా గవాయ్ రికార్డుకెక్కారు. ఈ సందర్భంగా నూతన సీజేఐ జస్టిస్ గవాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. అంబేద్కర్ సూత్రాలను అవలంబించిన కుటుంబంలో ఆయన జన్మించారు. జస్టిస్ బీఆర్ గవాయి తండ్రి ఆర్ఎస్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ నేత. బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా చేశారు.
ఇక గవాయ్.. 1985 మార్చి 16న బార్‌లో సభ్యుడిగా చేరారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనేక చరిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాలలో జస్టిస్ గవాయ్ ఉన్నారు.
పూర్వ జమ్మూ కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ ఉన్నారు. రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు.
రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజారిటీతో ఆమోదించిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ పాత్ర ఉంది. ఎస్సీల వర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రాలకు అధికారాలను అపాదిస్తూ 6:1 మెజారిటీతో తీర్పును వెలువరించిన ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ ఉన్నారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ ముఖ్యమైన తీర్పును వెలువరిస్తూ 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏ ఆస్తినీ కూల్చరాదని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు జారీచేసింది. అడవులు, వన్యప్రాణులు, చెట్ల పరిరక్షణకు సంబంధించిన అంశాలను విచారించే ధర్మాసనాలకు ఆయన సారథ్యం వహిస్తున్నారు. కంచెగచ్చిబౌలి కేసులో పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ విధానాల్ని తప్పుపడుతూ తీర్పు ఇచ్చారు.
ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ బీఆర్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23 వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు.