24.5 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img
Home Blog Page 460

సచివాలయంలో ఫైర్‌సేఫ్టీపై ఎస్‌పీఎఫ్‌కు అవగాహన

ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించడంతో పాటు, అగ్నిప్రమాదంపై అవగాహన పెంచేందుకు సచివాలయంలోని ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌ మెంట్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎస్‌పీఎఫ్‌ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో తెలంగాణ స్పెషల్ పోలీసుల రక్షణలో ఉన్న సచివాలయం భద్రతను ఇటీవల ఎస్పీఎఫ్‌కి అప్పగించారు. దీంతో, వాళ్లకు ఫైర్‌ సేఫ్టీపై అవగాహన కల్పించారు.

సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి.. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ G.V.ప్రసాద్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు జన్య, యాదయ్య, ప్రాథమిక అగ్నిమాపక అవగాహన కలిగించడంతో పాటు.. ఫైర్ ఎక్స్‌ టింగ్విషర్లు, ఫిక్స్‌డ్ ఫైర్ ఇన్‌స్టాలేషన్‌లను ఎలా ఉపయోగించాలనే అంశాన్ని వివరించారు. ఫైర్ సేఫ్టీ నివారణతో సహా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలను తరలించే విధానాల గురించి అగ్నిమాపక అధికారులు ఎస్‌పీఎఫ్‌ సిబ్బందికి తెలియజేశారు. బ్రొంటో స్కై లిఫ్ట్ ద్వారా టెర్రేస్ నుండి ఎలా రక్షించాలో, శ్వాస వ్యాయామాలు, కృత్రిమ శ్వాసక్రియతో కూడిన పద్ధతిని ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవదాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

యూపీ మెడికల్ కళాశాలలో అగ్ని ప్రమాదం

  • పది మంది చిన్నారుల సజీవదహనం
  • 16 మంది పిల్లలకు గాయాలు
  • అగ్నిప్రమాద సమయంలో అడ్మిట్ అయిఉన్న 54 మంది పిల్లలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ జిల్లాలో ఉన్న మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని పల్లల వార్డులో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగి పది మంది చిన్నారులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం రాత్రి 10.45 గంటల ప్రాంతాల్లో ఎన్ఐసీయూ విభాగంలో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో మొత్తం 54 మంది పిల్లలు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అడ్మిట్ అయి ఉన్నారు. పిల్లలు ఉన్న వార్డుగదుల్లో ఆక్సిజన్ పూర్తిగా వ్యాపించి ఉండటంతో మంటలు భారీగా విస్తరించాయని ఆసుపత్రి వర్గాలు చెపుతున్నాయి. మరణించిన పది మంది పిల్లల్లో రోజుల వయసు ఉన్న నవజాత శిశువులు కూడా ఉన్నారు. ఈ సంఘటనలో మరో 16 మంది పసి పిల్లలు కూడా గాయపడ్డారు. గాయపడ్డ పిల్లలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

లగచర్ల వాసులకు సత్యవతి రాథోడ్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంఘీభావం

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌పై దాడి కేసులో నిందితుల కుటుంబసభ్యులు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిశారు. తమ భూములను కోల్పోతున్నామని కమిషన్ దృష్టికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. ఐదు గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా పోలీసులు అక్రమ కేసులు పెట్టి తమ కుటుంబ సభ్యులను జైల్లో పెట్టారని కమిషన్‌కు కుటుంబసభ్యులు తెలిపారు. నిందితుల కుటుంబ సభ్యులకు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు మద్దతు తెలుపుతూ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అధికారం , దురహంకారం గిరిజనులపై చూపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ ప్రయత్నాన్ని విరమించుకొని, గిరిజనులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇక, వికారాబాద్‌ జిల్లాలో దాడులు జరిగింది అధికారుల మీద కాదని.. వాస్తవంగా గిరిజన ప్రజల మీద దాడులు జరిగాయని బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ పోలీస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. గిరిజన మహిళలఫై దాడులు చేసిన పోలీసులపై SC, ST కేసులు పెట్టాలని కమిషన్ ను కోరామన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించి కమిషన్ న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రజలకు SC ST కమిషన్ న్యాయం చేస్తుందని నమ్ముతున్నామన్నారు.

నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత

మాజీ శాసనసభ్యుడు, ఏపీ సీయం నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్ధితి విషమం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో శనివారం ఉదయం ఆయన మృతి చెందారు. తమ్ముడి మృతి వార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. అలాగే విజయవాడలో ఉన్న నారాలోకేష్ సైతం బాబాయ్ ని ఆసుపత్రికి తరలించిన వెంటనే బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరిగనున్నాయి.

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి : డిప్యూటీ సీఎం భట్టి

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి త్వరితగతన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్లకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని తెలిపారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకు గాను బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. రుణాల రీ పేమెంట్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆర్టీసీకి బస్సుల సమకూర్చేటువంటి మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామని, వారు కూడా విరివిగా రుణాలు అందించి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులకు డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్, SERP సీఈఓ దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, రెడ్కో వైస్ చైర్మన్,ఎండి వావిలాల అనీల తదితరులు పాల్గొన్నారు.

నారా రామ్మూర్తి నాయుడి పరిస్ధితి విషమం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సోదరుడు మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది. కుటుంబసభ్యలు ఆయన్ను హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. చిన్నాన్న ఆరోగ్యం విషమంగా ఉండటంతో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటీన హైదరాబాద్ బయలుదేరారు.

పట్నం నరేందర్ రెడ్డి హౌజ్ మోషన్ పిటీషన్ తిరస్కరణ

పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం కోర్టులకు సెలవు కావడంతో నరేంద్ర తరపు న్యాయవాది హౌజ్ మోషన్ మూవ్ చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేంద్రరెడ్డిని నేరస్తులతో కలిపి ఉంచారు. నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీనే కాకుండా మాజీ శాసనసభ్యుడు కూడా అయినందున అతన్ని స్పెషల్ బ్యారక్ లో ఉంచాలి పిటీషన్ లో కోరారు. అయితే కోర్టు నరేందర్ రెడ్డి తరపున దాఖలైన హౌజ్ మెషన్ పిటీషన్ను తిరస్కరించింది.

బీసీల సమస్యలపై పోరాడుతూనే ఉంటా – మల్లాడి కృష్ణారావు

బీసీల సమస్యల కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ ఆంశంలో ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. విజయవాడలో ఏపీ అగ్ని, వన్ని కుల క్షత్రియ సంక్షేమ సంఘం నూతన కార్యాలయ భవనం ప్రారంభ కార్యక్రమంలో మల్లాడి పాల్లొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, అగ్ని, వన్ని కుల క్షత్రియ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బర్రి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యకార సామాజికవర్గంలోని 14 ఉప కులాలకు చెందిన సమస్యలపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని ఘంటాపథంగా చెప్పారు. మత్స్యకారుల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిలను కలసి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. ఈ నెల 19వ తేదీన ( మంగళవారం) ముగ్గురిని కలసి వివరించనున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణా రావు, ఎమ్మెల్యేలు కొండబాబు, బొమ్మిడి నాయకర్ లతో పాటు మరి కొందరి పెద్దలతో కలసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిను, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిలను కలవనున్నామని వెల్లడించారు.

ఫార్మా విలేజ్ పేరుతో భూ దందా…కెటిఆర్ విమర్శ

లగచర్లలో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్ల బాధిత రైతులను సంగారెడ్డి జైల్లో ఈరోజు(శుక్రవారం) ములాఖత్ అయి పరామర్శించిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. లక్షల రూపాయల విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటారన్నారు.

కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని, గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డి యే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడని ప్రశ్నించారు.

కేటీఆర్ కామెంట్స్

జైల్లో ఇప్పుడు మేము 16 మందిని కలిశాం. వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉంది. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు.

ఇంకొక తమ్ముడు వనపర్తి లో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారు. ఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారు. ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారు. దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్ లో రాజ్యంగేతర శక్తి గా మారాడు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నాడు. కొడంగల్ లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని చెబుతున్నారు.

నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు. అరెస్ట్ చేసిన 70 మందిలో బీఆర్ఎస్ చెందిన 21 మందిని మాత్రమే చిత్ర హింసలు పెట్టి కేసులు పెట్టారు. మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు. దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారు. వాళ్ల చేతగాని తనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారు.

21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే. వికారాబాద్ ఎస్పీ, సీఐలు, ఎస్ఐలు వారిని చిత్ర హింసలు పెట్టారు. మూడు మూడు గంటల పాటు కొట్టారు. మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని వాళ్లు మాకు చెప్పారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరుండేది ఐదేళ్లు మాత్రమే. అధికారం శాశ్వతమని భావించకండి. నువ్వు చక్రవర్తి వి కాదు. నీలాంటి చాలా మందిని చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు గుంజుకుంటా అంటే మేము ఊరుకోం.

రేవంత్ రెడ్డి పై ఇవ్వాళ కొడంగల్ మర్లవడ్డది. రేపు తెలంగాణ మొత్తం మర్లవడతది. కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు. మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం. రైతులను వదిలేయ్. నువ్వు అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తాకుతది.

21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుంది. రాఘవేంద్ర అనే ఉద్యోగి తన ఉద్యోగం కోసం భయపడుతున్నాడు. ఆయన ఉద్యోగం పోకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం. మిగతా బాధిత రైతులకు కూడా చెబుతున్నా మీరు భయపడకండి. ఇంతకంటే మిమ్మల్ని వాళ్లు ఏం చేసేది లేదు. ఉరి శిక్ష వేయరు. ధైర్యంగా ఉండండి.

ఫార్మా విలేజ్ పేరుతో తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడు. 30, 40 కిలోలు కూడా లేని పిల్లలపై అంటెంప్ట్ మర్డర్, కలెక్టర్ పై దాడులు చేశారంటూ కేసులు పెట్టారు. పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలపై కేసులు పెట్టటానికి నీకు మనసేలా వచ్చింది రేవంత్ రెడ్డి.

ఫార్మా విలేజ్ పేరుతో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే భూముల దందా చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. జ్యోతి అనే గర్భిణీ మహిళ భర్తను అరెస్ట్ చేశారు. ఆమె ఎంతో ఆవేదనతో ఉంది. ఆ మహిళకు వైద్యం సాయం అందిస్తాం. బీఆర్ఎస్ పేదలు, ప్రభుత్వ బాధితుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుంది.

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీఆర్‌ఎస్ కుట్ర : మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని మంత్రి శ్రీథర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లకు ఎవరు వచ్చినా దాడులు చేయాలని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులపై దాడులు చెయ్యమని చెప్పింది ఎవరో వీడియోలో స్పష్టంగా ఉందని
శ్రీధర్‌బాబు చెప్పారు. కలెక్టర్, కడా ఛైర్మెన్‌ను చంపే ప్రయత్నం చేశారని ఆవేదన చెందారు. పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక చిహ్నమని, ప్రగతికోసం ఆయా ప్రాంత ప్రజలను మెప్పించి మాట్లాడతామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆయా ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com