మహారాష్ట్రలో మహాయుతి రాజకీయాలు కొలిక్కి వస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైంది. బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు ఎన్డీఏ పక్షాలకు స్పష్టతనిచ్చినట్టు తెలుస్తున్నది. గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యమంత్రితోపాటు సగానికిపైగా మంత్రి పదవులను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. ఇందులో షిండే నేతృత్వంలోని శివసేనకు 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 9 మంత్రి పదవులు ఇచ్చే దిశగా ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. ఇందులో షిండే వర్గానికి మూడు కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది. పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, జలవనరులు లభించే అవకాశం ఉందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో మంత్రివర్గంలోకి 49 మందిని తీసుకునేందుకు అవకాశం ఉంది.