29.4 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ నంబర్ వన్ – మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. సంబంధిత పరిశ్రమల భాగస్వామ్యంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేలా కోర్సులకు రూపకల్పన చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. బయో ఏషియా 2025 సదస్సు ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభం అయింది.

ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు…లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి… ప్రపంచ పటంలో తెలంగాణను ప్రత్యేక స్థానానికి తీసుకెళ్ళిందన్నారు. ఈ ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదు.. రెండు దశాబ్దాల కిందట మొదలైంది.. ఈ స్ఫూర్తి తో తెలంగాణ బ్రాండ్ ను విశ్వ వ్యాప్తం చేస్తామని మంత్రి తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగంలో ముఖ్యంశాలు

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను నంబర్ వన్ గా మార్చడంలో జీనోమ్ వ్యాలీ పాత్ర కీలకం. “హార్ట్ ఆఫ్ ది లైఫ్ సైన్సెస్” జీనోమ్ వ్యాలీని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యక్షంగా 51వేల మందికి, పరోక్షంగా 1.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అభివృద్ధి చేస్తాం.

పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి… రాష్ట్రాభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణలో రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై ఉన్న నమ్మకం.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై ఉన్న భరోసా ను చాటి చెప్పేందుకు ఈ ఒక్కటీ చాలు.

పరిశ్రమల ఏర్పాటుతోనే ఆగిపోము. రాష్ట్ర ప్రభుత్వం వారితో కలిసి పని చేస్తుంది. యూనివర్సిటీలు, స్టార్టప్, పరిశోధన సంస్థలతో భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహిస్తాం. కొత్త ఆలోచనలకు అండగా ఉంటాం. ఎంఎస్ఎంఈ లను ప్రోత్సహించి లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి పథంలోకి తీసుకెళ్తాం. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న జనరిక్ మందుల్లో తెలంగాణ వాటా 20 శాతం. వ్యాక్సీన్ల ఉత్పత్తిలో మన వాటా 40 శాతం. 200కు పైగా దేశాలకు ఏటా 5 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

ఏఐ, క్వాంటం, రోబోటిక్స్ తదితర నూతన టెక్నాలజీ సాయంతో రోగుల అవసరాలకు అనుగుణంగా, వారికి త్వరగా సాంత్వన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాము. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి వ్యయంతో మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చి దిద్దుతాము. ఇప్పటికే పలు ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు తెలంగాణలో తమ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్, ఆర్అండ్ డీ, జీసీసీ లను ప్రారంభించాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫలితంగా లైఫ్ సైన్సెస్ గ్లోబల్ సప్లై చెయిన్ లో తెలంగాణ వాటా మరింత పెరిగింది.

ఈరోజు ఆస్ట్రేలియా – క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ, యూకే కి చెందిన ఎన్ హెచ్ఎస్, టీ హబ్ తో ఎంవోయూ చేసుకున్నాము. గ్రాన్యూయల్స్, భారత్ బయోటెక్, ఆజియంట్, బయోలాజికల్ బీఈ తదితర దేశీయ, విదేశీ దిగ్గజ ఫార్మా సంస్థలతో ఒప్పందాలు చేసుకోబోతున్నాం. అసోసియేషన్ ఆఫ్ కాంట్రాక్టు రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యనుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్స్(సీఆర్డీఎంవో) తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com