ఎట్టకేలకు బెజవాడలో ఉన్న పాకిస్తాన్ కాలనీ పేరును మారుస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఎంతో కాలంగా బెజవాడ నగరంలో పాకిస్తాన్ పేరుతో ఒక కాలనీ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ కాలనీ వాసులు మాత్రం తాము నివశించే ప్రాంతానికి పాకిస్తాన్ పేరు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమ కాలనీ పేరు మార్చాలని ఎన్నో ఏళ్లుగా వారు పోరాటం చేస్తు్న్నారు. కానీ ఎవరూ వారి గోడు పట్టించుకోలేదు. మన దేశంలో అందునా బెజవాడలాంటి ప్రాంతంలో పాకిస్తాన్ పేరుతో కాలనీ ఉండటం ఏంటనే ఆలోచన కూడా ఏ అధికారికీ రాలేదు. అయితే ఎట్టకేలకు బెజవాడ పాకిస్తాన్ కాలనీ వాసుల కృషి ఫలించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీషా వారి కాలనీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ కాలనీని భగీరథ కాలనీగా పేరు మారుస్తూ కలెక్టర్ లక్ష్మీషా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షం అదే కాలనీలో ఆధార్ కేంద్రాన్ని కూడా ప్రారంభించి కాలనీ వాసులందురు అడ్రస్‌లో పేరు మార్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ నుంచి కొంత మంది వస్త్ర వ్యాపారాలు బెజవాడకు వచ్చి వ్యాపారాలు చేసుకునే వారు. వారందరూ బెజవాడలోని నున్న పోలీస్ స్టేషన్ సమీపంలో వసతి ఏర్పాటు చేసుకోవడంతో ఆ ప్రాంతం పాకిస్తాన్ కాలనీగా వ్యవహారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి అది పాకిస్తాన్ కాలనీగానే కొనసాగుతోంది. ఇంతకాలానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఆ కాలనీ పేరును భగీరధ కాలనీగా మార్చడంతో ఆ ప్రాంత వాసులందరూ కలెక్టర్ లక్ష్మీషాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
- Advertisement with us -