బంగ్లా దేశ్‌లో అరెస్టయిన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన సమితి అధికార ప్రతినిధి చిన్మయ్ దాస్ కి బెయిల్ ఇవ్వక పోవడం పట్ల ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు.చిన్మయ దాస్‌ను అరెస్టు చేసిన రోజున ఆయన తరపున వాదించాల్సిన లాయర్‌ను కొందరు దారుణంగా చితకొట్టడంపై ఆమె మండిపడ్డారు. బంగ్లాదేశ్ లో జిహాద్ మూకల విశృంఖలత్వానికి అది నిదర్శనమన్నారు. దేశంలో హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారని, హిందువులకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. చిన్మయ దాస్‌ను జైల్లో పెట్టడం అంటే అతని మానవ హక్కులను ఉల్లంఘించడమేనని, హిందువుల చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయడమేనని తస్లీమా అభిప్రాయపడ్డారు. ఛట్టోగ్రామ్ కోర్డులో చిన్మయ్ దాస్ కేసు విచారణ జనవరి 2కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిన్మయ్ తరపున వాదించేందుకు బంగ్లాదేశ్ మొత్తం మీద లాయర్ లేకపోవడం దారుణమని, ఆయనపై నమోదైన కేసులన్నీ తప్పుడువేనని, కల్పితాలేనని తస్లీమా తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ మతాన్ని సమూలంగా ఏరి పారేసి తమకు అనుకూలంగా మలచుకోవాలని జిహాదీలు ప్రయత్నిస్తున్నారన్నారు.
మరోవైపు చిన్మయ్ క్రిష్ణ దాస్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని కోల్‌కతాలోని ఇస్కాన్ సంస్థ కూడా విచారం వ్యక్తం చేసింది.అరెస్టయిన తొలిరోజున చిన్మయ్ తరపున బెయిల్ కోసం కేసు వాదించిన లాయర్ రేగన్ ఆచార్యను దారుణంగా చితకబాది ఆస్పత్రి పాలు చేశారని, అతని ఛాంబర్ ను కూడా ధ్వంస చేశారని కొల్‌కతా ఇస్కాన్ సంస్థ తెలిపింది. నవంబర్ 25న హిందూవుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించినందుకు చిన్మయ్ క్రిష్ణ దాస్ ను అరెస్టు చేశారు. కోర్టుకు తీసుకు వస్తున్న టైమ్ లోనూ, అరెస్టును వ్యతిరేకిస్తూ చట్టోగ్రామ్ లో హిందువుల నిరసన ప్రదర్శనలను దారుణంగా అడ్డుకున్నారు. నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం, చిన్మయ్‌కు అనుకూలంగా వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన అప్పటినుంచి జైలులోనే ఉన్నారు. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం ఆలిఫ్ కూడా ఈ హింసాకాండలో మరణించారు.
చిన్మయ్ అరెస్టు ఎందుకు?
చిన్మయ్ దాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ సమితి ప్రతినిధిగా ఉన్నారు. గతంలో ఆయన ఇస్కాన్ సంస్థ మద్దతుదారుగా వ్యవహరించేవారు. ఛట్టోగ్రామ్‌లో హిందూ అనుకూల ర్యాలీ నిర్వహించేందుకు బయల్దేరిన ఆయన్ను ఢాకాలోని హజ్రత్ షా జలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. చిన్మయ్‌కు వ్యతిరేకంగా ఛట్టోగ్రామ్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు నిరసన ర్యాలీ చేయడంతో ఆయన్ను కోర్టులో హాజరు పరచలేదు.
భారత్ ఆందోళన..
తాజా పరిణామాల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, నిరసనలు, అల్లర్లు పేట్రేగడానికి, చిన్మయ్ అరెస్టుకు ప్రస్తుత ప్రధాని, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనసే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. బంగ్లా దేశ్‌ను జిహాదీల అడ్డాగా మార్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.